దక్షిణ కొరియాతో సవరించిన డీటీఏఏ ఒప్పందం ఖరారు
ప్రధాని మోదీ పర్యటనలో సంతకాలు
సియోల్: ద్వంద్వ పన్నుల నివారణకు సంబంధించి సవరించిన ఒప్పందంపై (డీటీఏఏ) భారత్, దక్షిణ కొరియాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్య సహకారాన్ని మరింతగా పెంచుకునే దిశగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దం పరిధిని విస్తరించడంపై ఈ ఏడాది జూన్ నాటికి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హైతో ప్రధాని నరేంద్ర మోదీ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
రెండు దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్న దృష్ట్యా.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఇరు దేశాల వ్యాపారవేత్తలు పరస్పరం సహకరించుకోవాలని వారు సూచించారు. భారత్, దక్షిణ కొరియా 2010లో కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సవరణలపై వచ్చే ఏడాది జూన్ కల్లా చర్చలు ప్రారంభం కాగలవని వెల్లడించారు. ఇన్‌ఫ్రా రంగంలో పరస్పర సహకారం కోసం దక్షిణ కొరియా ఆర్థిక శాఖ, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ దాదాపు 10 బిలియన్ డాలర్లు సమకూర్చనున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం తక్కువ స్థాయిలో ఉందని, దీన్ని మరింతగా పెంచుకోవాలని మోదీ, గెన్ హై పేర్కొన్నారు.