కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు, అక్షరాలు అపురూపంగా ఉన్నాయి. కానీ దళిత, బహుజన, మైనారిటీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పక తప్పదు. ప్రధానంగా బడ్జెట్‌కు ఉండే రాజ్యాంగ స్పృహ తగ్గింది. దళితులకు భూమి, ఉపాధి, సాంకేతిక జ్ఞానం, నైపుణ్యం అందించి నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
భారతదేశ ఆర్థిక ఉత్పత్తిలో దళిత బహుజనులను భాగస్వామ్యం చేసినప్పుడే దేశ సంపద పెరుగుతుందనిఅంబేడ్కర్ అన్నారు. వారికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు వారి జీవనాభివృద్ధిని నిర్లక్ష్యం చేసేలాగానే ఉన్నాయి. మురుగువాడల నిర్మూలనకు, నూత్న పారిశ్రామిక వాడల నిర్మాణానికి పథకాలు లేవు. వ్యవసాయం, విద్య, ఉపాధి లాంటివాటి విషయంలోనూ బడ్జెట్ ఏ దూరదృష్టినీ కనబరచలేదు.
2024–25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు, అక్షరాలు అపురూపంగా ఉన్నాయి. కానీ దళిత, బహుజన, మైనారిటీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పక తప్పదు. పన్నుచెల్లింపు దారులకు బడ్జెట్ అనుకూలంగా ఉంది. ప్రధానంగా బడ్జెట్‌కుఉండే రాజ్యాంగ స్పృహ తగ్గింది. భారతదేశ ఆర్థిక ఉత్పత్తిలో దళిత బహు జనులను భాగస్వామ్యం చేసినప్పుడే దేశ సంపద పెరుగుతుందని అంబేడ్కర్ అన్నారు. దళితులు శ్రామిక శక్తులు. వారికి భూమి, ఉపాధి, సాంకేతిక జ్ఞానం, నైపుణ్యం అందించినప్పుడే భారతదేశసంపద పెరుగుతుంది.
భారతదేశం ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయిక దేశం. ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి గ్రామాల్లో ఊరు వేరుగా ఉంది, దళితవాడ వేరుగా ఉంది. దళిత వాడకు విద్యుత్ సౌకర్యం లేదు. మంచినీటి సదుపాయం లేదు. మురుగు నీటి వ్యవస్థ లేదు. రోడ్లు లేవు. దళితులు 3, 4 కుటుంబాలు ఒక్క సెంటులో జీవిస్తున్నారు. భారత గ్రామాలను చూసిన విదేశీ పరిశోధకులు ఇది స్పృశ్య భారతమా? అస్పృశ్య భారతమా? అని అడుగుతున్నారు. గ్రామాల్లో ఉన్న వృత్తికారులు పట్టణాలకు వెళ్ళి మురుగువాడల్లో జీవిస్తున్నారు. నివాసానికి ఇళ్ళులేక మురుగు కాలువల మీద చెక్కబద్దలు వేసుకొని వాటిమీద బతుకుతున్నారు.
ఈ మురుగువాడల నిర్మూలనకు, నూత్న పారిశ్రామిక వాడల నిర్మాణా నికి పథకాలు లేవు. గ్రామీణాభివృద్ధి పథకం కింద 25 వేల గ్రామీణ జనావాసాలు ఉన్న దగ్గర శాశ్వత రహదారులు నిర్మిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అనేక దళితవాడలు, గిరిజన వాడలకు ఇంత జనాభా ఉండదు. అందుకే ఇది పన్ను కట్టేవారి బడ్జెట్ గానే మన ముందుకు వచ్చింది. నిజానికి గిరిజన గ్రామాలు ఇంకా ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సంక్షోభంలోనే ఉన్నాయి. గర్భవతిగా ఉన్న వారిని డోలీల్లో మోసుకొచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు. వారికి కేటాయించిన అతి స్వల్ప నిధి వారి జీవనాభివృద్ధిని నిర్లక్ష్యం చేసే లాగానే ఉంది.
ఇకపోతే వ్యవసాయ రంగానికి ఇచ్చిన కేటాయింపుల్లో దూరదృష్టి లేదనీ, రైతులకు మేలు జరిగే అంశాలు లేవనీ రైతు సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధతపై ఎలాంటి ప్రకటన చేయలేదని కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) నాయకుడు సర్వన్ సింగ్ పంఢేర్ అన్నారు. సంయుక్త కిసాన్ మెర్చా నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ స్పందిస్తూ, వ్యవసాయ రంగానికి కేటాయింపు పెరగాల్సిందన్నారు.
రైతులకు సంబంధించినంత వరకు ఇది ఫ్లాప్ బడ్జెట్ అని మరొక రైతు నేత హర్మీత్ సింగ్ కడియన్ వ్యాఖ్యానించారు. పంజాబ్ రైతులకు మొండిచేయి చూపిందనీ, వ్యవసాయ వైవిధ్యత ప్యాకేజీగానీ, ఆగ్రో–ఇండస్ట్రియల్ ప్యాకేజిగానీ ప్రకటించలేదని అన్నారు. మరో విషయం. బడ్జెట్‌లో భారతదేశంలో నిరంతరంగా వస్తున్న తుఫాన్లు, వరదలు, అతి ఉష్ణోగ్రతలు, అతి శీతలాలను పరిష్కరించే విధానాలకు, కార్యక్రమాలకు నిధులు కేటాయించలేదు.
ఇకపోతే భారత దేశానికి ఊపిరిలాంటి విద్యా రంగానికి భారీగా కోత పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు కేటా యించగా, ఈసారి రూ.1.20 లక్షల కొట్లే ఇచ్చి, తొమ్మిది వేల కోట్లు తగ్గించారు. భారతదేశంలో నిరక్షరాస్యత పెరగడానికి కారణం వయో జన విద్యకు అక్షరాలు రాయాల్సిన స్త్రీలు టీవీలకు బుర్రల్ని అప్ప జెప్పడం! కేంద్ర విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా ల్యాబులు, లైబ్రరీలు లేవు.
పరిశోధకులకు సరైన స్కాలర్‌షిప్‌లు లేవు. భారత దేశంలో ఉన్నత విద్య సరిగా లేక విద్యార్థులు విదేశాలకు వలస పోతున్నారు. నిజానికి విద్యారంగాన్ని దెబ్బతీసే అనేక కోతలు జరిగాయి. ఉన్నత విద్య నియంత్రణ మండలి యూజీసీకి 60 శాతానికి పైగా నిధులు తగ్గించారు. దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐఎంలకు వరుసగా రెండో ఏడాది కూడా కేటాయింపులు తగ్గించారు.
ఇకపోతే మరోపక్క నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ బడ్జెట్‌లో ఉద్యోగ వసతికి ప్రాధాన్యం బాగా తగ్గించారు. భారత దేశాన్ని యువ భారతం అని పిలుస్తున్నారు. యువత దేశ భవిష్యత్‌కు సజీవ శక్తి లాంటిది. కానీ ఈ బడ్జెట్ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను నిరాకరిస్తోంది. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక మత్తు మందులకు, గంజాయికి అలవాటుపడుతున్నారు, నేరాలకు పాల్పడు తున్నారు.
వారికి ప్రభుత్వ ఉద్యోగ వసతి కలిగించినట్లయితే వారు నేరస్థులుగా, అర్ధ నేరస్థులుగా జీవించరు. వారిలో వ్యక్తిత్వ నిర్మాణ దక్షత పెరుగుతుంది. ఒక యువకుని వ్యక్తిత్వ నిర్మాణానికి లౌకికవాద భావజాలం, లౌకికవాద దృష్టి, సామాజిక స్ఫూర్తి అన్నీ అవసరం. స్కిల్ నైపుణ్యం ఒక్కటే చాలదు, జీవన నైపుణ్యం కావాలి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణం అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లను గ్రాంట్‌గా కాక రుణంగా ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. అసలు రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ఈ రోజున ఇచ్చే నిధులన్నీ అప్పుగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ఆశ్చర్యంగా ఉంది.
మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్), స్టాలిన్ (తమిళనాడు), రేవంత్ రెడ్డి (తెలంగాణ), విజయన్ (కేరళ), సిద్ధరామయ్య (కర్ణాటక) లాంటి ముఖ్య మంత్రులందరూ రాష్ట్ర ప్రభుత్వాల అస్తిత్వాన్నీ, ఆర్థిక ప్రజాస్వా మ్యాన్నీ దెబ్బతీసేదిగా ఈ బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సైతం బడ్జెట్‌లో సామాజిక న్యాయం లేదనీ, భారతదేశ ఆర్థిక ప్రగతికి విఘాతం కలిగించే శక్తులకు ఈ బడ్జెట్‌ను అప్పగించే ప్రయత్నం జరుగుతోందనీ అన్నారు.
ఇకపోతే ఉపాధి హామీ రంగానికి ఈ బడ్జెట్‌లో కోతలు విధించి బుద్ధిపూర్వకంగా శ్రామికుల ఆదాయ మార్గాన్ని దెబ్బతీశారని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి అంబేడ్కర్ బడ్జెట్ నిర్మాణంలో తప్పకుండా భూమి పంపకం ఉండాలనీ, కుల నిర్మూలనా భావం ఉండాలనీ అన్నారు. కులాన్ని నిర్మూలించే భావ చైతన్యం కోసం, ఆచరణాత్మక కార్యక్రమం కోసం బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉన్నప్పుడే, దేశంలో సామరస్యత, శాంతి ప్రజ్వ రిల్లుతాయనీ చెప్పారు.
దేశానికి మత సామరస్యం, లౌకికవాద భావన, సామ్యవాద సిద్ధాంత స్ఫూర్తి చాలా అవసరం అని నొక్కి చెప్పారు. దళితులు, ఆదివాసీల సమస్యలను వారి ఎంపీలే మాట్లాడితే అందులో సానుభూతి కాకుండా స్వీయ అనుభవపు గొంతుక విన బడుతుంది. ఒక జగ్జీవన్‌రావ్‌ు, ఒక దామోదరం సంజీవయ్య, ఒక ప్రగడ కోటయ్య లాంటివాళ్ల గొంతులు లోక్‌సభలో, రాజ్యసభలో వినిపించేవి. ఇప్పుడు రెండు సభల్లోనూ ఆధిపత్య కులాల ప్రతినిధులే మాట్లాడుతున్నారు.
చివరకు రాహుల్ గాంధీని ‘నీది ఏ కులం?’ అనే దాక పరిస్థితి వెళ్ళింది. వాళ్ళ తాత ఫిరోజ్ గాంధీ ఒక పార్శీ, ఇందిరా గాంధీ కశ్మీరీ బ్రాహ్మణుడైన నెహ్రూ కుమార్తె. అది వర్ణాంతర వివాహం. వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలది దేశాంతర వివాహం. మూడు తరాలు వర్ణాంతరం చేసుకుంటే వారికి కులంఉండదు. రాబోయే కాలం కులాంతర సమాజం. అది అందరం తప్పకుండా అర్థం చేసుకోవలసిన విషయం.
ఇప్పుడు దళిత, బహుజన, మైనారిటీ, స్త్రీవాద, లౌకికవాద మేధావులంతా పార్టీలకు అతీతంగా అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించాలి. సామ్యవాద, లౌకికవాద భారతాన్ని నిర్మించడం కోసం నడుం కట్టాలి. అప్పుడే భారతదేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసం కలుగుతుంది.
- వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
- డా‘‘ కత్తి పద్మారావు
Comments
Please login to add a commentAdd a comment