ఈపీఎఫ్ పన్ను ఉపసంహరణ
మధ్య తరగతికి ఊరటనిచ్చే చర్య
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ పన్ను విధింపుపై చెలరేగిన ఆందోళనలు సమంజసమైనవని భావించడంతో పన్ను విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఉద్యోగులకు మరింతగా ప్రయోజనం కల్పించడానికే ఈ పన్ను ప్రతిపాదన తెచ్చామని, అంతేకాని పన్ను ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. పెన్షన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికే ఈ ప్రతిపాదన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిక్కి ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
వివాదస్పదమైన ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సరైన చర్య అని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనివల్ల అందరికీ అర్థమైందని కేపీఎంజీ ఇండియా హెడ్(ట్యాక్స్) గిరీష్ వన్‌వరి చెప్పారు. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం మధ్యతరగతికి ఊరటనిచ్చే చర్య అని నంగియా అండ్ కో ఈడీ నేహ మల్హోత్ర చెప్పారు. తమ రిటైర్మెంట్ పొదుపులను తమకు ఇష్టం వచ్చిన రీతిలో వినియోగించుకునే స్వేచ్ఛ వారికి లభించిందని వివరించారు.
ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం పట్ల ఆన్‌లైన్ పిటీషన్ ప్లాట్‌ఫారమ్ ఛేంజ్‌డాట్‌ఓఆర్‌జీ హర్షం వ్యక్తం చేసింది. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ పిటీషన్‌పై సంతకాలు చేసిన రెండున్నర లక్షలమందికి ఇది అతిపెద్ద విజయమని పేర్కొంది. గుర్గావ్‌కు చెందిన ఆర్థిక రంగ నిపుణులు, వైభవ్ అగర్వాల్ ఈ ఆన్‌లైన్ పిటీషన్‌ను ప్రారంభించారు.