‘ఈపీఎఫ్’ ఉపసంహరణపై పన్నులేదు | Tax cancelled on EPF Withdrawal by govt | Sakshi
Sakshi News home page

‘ఈపీఎఫ్’ ఉపసంహరణపై పన్నులేదు

Published Wed, Mar 9 2016 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

‘ఈపీఎఫ్’ ఉపసంహరణపై పన్నులేదు

‘ఈపీఎఫ్’ ఉపసంహరణపై పన్నులేదు

 ► వెనక్కి తగ్గిన కేంద్రం
 ► ఉద్యోగులు, కార్మికుల నుంచి
     తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం
 ►పాత నిబంధనలే కొనసాగుతాయని
     లోక్‌సభలో ప్రకటించిన జైట్లీ
 ► బడ్జెట్ ప్రతిపాదనల్లోని 138, 139
     పేరాలను తొలగిస్తున్నట్లు ప్రకటన
 ►ఎన్‌పీఎస్‌పై ప్రతిపాదనలు మాత్రం
     కొనసాగిస్తామని వెల్లడి


 న్యూఢిల్లీ: ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్- ఉద్యోగుల భవిష్యనిధి)’పై బడ్జెట్‌లో చేసిన పన్ను ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను ఉండదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ చందాదారులు ఉపసంహరించుకునే సొమ్ములో మొత్తంలో 40 శాతం సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంటుందని, మిగతా 60 శాతం సొమ్ముపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే నిపుణులతో చర్చించిన తర్వాత ఈపీఎఫ్ ఉపసంహరణ పన్ను ప్రతిపాదనను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. అయితే ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) నుంచి ఉపసంహరించుకునే  సొమ్ములో 40 శాతంపై ఇచ్చిన పన్ను మినహాయింపు రాయితీ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యాజమాన్యాల తరఫున భవిష్యనిధికి జమయ్యే మొత్తంపై పన్ను మినహాయింపుపై విధించిన రూ.1.5 లక్షల పరిమితి ప్రతిపాదనను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
‘పన్ను’పై తీవ్రస్థాయిలో విమర్శలు
 ఇతర యాన్యుటీ పథకాల్లాగానే ఈపీఎఫ్‌పై కూడా పన్ను విధిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం... ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపై కాకుండా దానికి సంబంధించిన వడ్డీపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు వేతనం రూ.15,000 దాటిన వారికి మాత్రమే ఈ ప్రతిపాదనలు వర్తిస్తాయని... 3.7 కోట్ల మంది చందాదారుల్లో పన్ను పరిధిలోకి వచ్చేది కేవలం 70 లక్షల మంది మాత్రమేనని పేర్కొంది. అయితే ఈ వివరణలు ఉద్యోగుల్లో గందరగోళాన్ని, భయాన్ని మరింత పెంచాయి. మరోవైపు ఈ పన్ను వల్ల భవిష్యత్తు అవసరాల కోసం ఈపీఎఫ్‌లో జమ చేసే మొత్తం తగ్గడమే కాకుండా ఈపీఎఫ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు హెచ్చరించారు. దీంతో అన్ని పక్షాలతో సమావేశమైన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని 138, 139 పేరాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

కానీ ఈ పేరాల్లో ఎన్‌పీఎస్ 40 శాతం విత్‌డ్రాయిల్స్‌పై ప్రవేశపెట్టిన పన్ను మినహాయింపులు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పించే విధంగా యాన్యుటీ పథకాల్లో పెట్టుబడిని ప్రోత్సహించడానికే ఈపీఎఫ్ ఉపసంహరణపై ప్రతిపాదనలు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఆదాయం సమకూరదని జైట్లీ పేర్కొన్నారు. ఈ పన్ను వల్ల ప్రైవేటు ఉద్యోగులు ఈపీఎఫ్‌లో దాచుకున్న మొత్తాన్ని మధ్యలో తీసేసుకోకుండా ఉంటారని... రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందేందుకు దోహదపడుతుందని చెప్పారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగస్తులు ఎందులో పెట్టుబడి పెట్టాలన్న దానిపై స్వేచ్ఛ కోల్పోతారన్న అభిప్రాయంతో ఏకీభవించారు. ఉద్యోగులు, కార్మికుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని  పన్ను ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంటే ఈపీఎఫ్ నుంచి ఉపసంహరించుకునే మొత్తంపైగానీ, వడ్డీపై గానీ ఇక ఎటువంటి పన్ను ఉండదు. ఈపీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి పాత నిబంధనలే కొనసాగుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement