ఈపీఎఫ్‌లో.. ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమా? | EPF Investments to continue ..? | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌లో.. ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమా?

Published Sun, Mar 6 2016 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

ఈపీఎఫ్‌లో..  ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమా?

ఈపీఎఫ్‌లో.. ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమా?

నా వయస్సు 40 సంవత్సరాలు. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)లో ఎక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్, వీటిపై వడ్డీ కూడా కలుపుకొని ఈ మొత్తం ఇప్పుడు రూ.40 లక్షలకు చేరింది. ఇది కాకుండా లార్జ్ క్యాప్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో నెలకు రూ.15,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను.  రిటైరైనప్పుడు ఈపీఎఫ్ నుంచి 40 శాతానికి మించిన విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు కదా ! ఈ పరిస్థితుల్లో ఈపీఎఫ్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? లేకుంటే ఈపీఎఫ్‌లో పెట్టే అధిక పెట్టుబడులను వేరే సాధనాల్లోకి మళ్లించమంటారా? తగిన సూచనలివ్వండి.    - జగన్నాథ్, విశాఖపట్టణం

 ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే ఏ వ్యక్తి అయినా తన కార్పస్‌లో 40 శాతం వరకూ విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి పన్ను ఉండదు. ఈ కార్పస్‌లో 60 శాతానికి యాన్యుటీని కొనుగోలు చేస్తే పన్ను బాధ్యత ఉండదు. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆర్జించిన వడ్డీపై మాత్రమే పన్ను ఉంటుందని, అసలుపై పన్ను ఉండదని తాజాగా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అయితే ఈ విషయమై పూర్తిగా స్పష్టత వచ్చేదాకా వేచి చూడడమే మంచిది. ఆ తర్వాత దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే పన్ను విషయాలను పక్కన బెడితే, ఈపీఎఫ్‌లో స్వచ్ఛందంగా ఇన్వెస్ట్ చేయడాన్ని మీరు నిలిపేయవచ్చు.

కేవలం మీ ఇన్వెస్ట్‌మెంట్స్ భద్రత కోసం మీరు రాబడుల విషయంలో రాజీ పడ్డారని భావిస్తున్నాం. ఇలా కాకుంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ మొత్తంపై మరింతగా రాబడులు పొందే అవకాశముంది.  అందుకని ఈపీఎఫ్ స్వచ్ఛంద ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేసి ఆ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. దీనివల్ల మంచి రాబడులు రావడమే కాకుండా దీర్ఘకాలంలో మీ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం తగిన స్థాయిలో సంపదను సమకూర్చుకున్నవారవుతారు.


 కొత్త బడ్జెట్ ప్రకారం, నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)కు సంబంధించి పన్ను సంబంధిత విషయాల్లో మార్పులు జరిగాయని తెలిసింది. ఈ కొత్త ప్రతిపాదనలు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి అనుకూలంగానే ఉన్నాయా ? వివరించగలరు   -సుచరిత, రాజమండ్రి

నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)కు సంబంధించి పన్ను అంశాల్లో ఒక ముఖ్యమైన మార్పును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ తాజా బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి రిటైరైనప్పుడు తన కార్పస్‌లో 40 శాతం  విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి పన్ను విధించరు. గతంలో ఈ 40 శాతం మొత్తాన్ని ఆ వ్యక్తి ఆదాయానికి కలిపి, ఆ వ్యక్తికి వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలన్న నిబంధన ఉండేది.  గతంలో.. ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు తన ఎన్‌పీఎస్ కార్పస్‌లో కనీసం 40 శాతం మొత్తంలో యాన్యుటీని కొనుగోలు చేయాలి.

60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విత్‌డ్రా చేసుకున్న మొత్తంపై పన్ను ఉండేది. ఇక తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, ఒక వ్యక్తి తన ఎన్‌పీఎస్ కార్పస్‌లో 40 శాతం వరకూ మొత్తాన్ని ఎలాంటి పన్ను పోటు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 60 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. పన్ను బాధ్యత నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. 40 శాతం మొత్తాన్ని ఎలాంటి పన్ను పోటు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించి ఆ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.


 నేను గత కొన్నేళ్లుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏమైనా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లంచాల్సి ఉంటుందా? తాజా బడ్జెట్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? - వికాస్, తిరుపతి

ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయమై బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగలేదు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఏమీ ఉండదు. మీరు నిరభ్యంతరంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో  ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు రాబడులు కూడా బాగా వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement