అష్ట సతుల్లోనూ కృష్ణునికి అత్యంత ఇష్టురాలు సత్య. నారీ శక్తికి, స్త్రీ ఆత్మగౌరవానికి తిరుగులేని ప్రతీక. నరకునితో పోరుతూ వాసుదేవుడు సొమ్మసిల్లిన వేళ విల్లు చేపట్టి అంతటి రాక్షసుణ్నీ అలవోకగా నిలువరిస్తుంది. ఆధునిక భారత మహిళను సత్యభామలా సాధికార పరచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో పలు కీలక కేటాయింపులు చేశారు అరుణ్ జైట్లీ...
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో మహిళలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఉచిత గ్యాస్ కనెక్షన్లు సహా.. ఉద్యోగాలు చేసే మహిళలు, స్వయం సహాయక బృందాలకు భారీగా నిధులను కేటాయించింది. పేద మహిళలకు ఇవ్వాల్సిన ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల సంఖ్యను 8 కోట్లకు పెంచినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. పేద మహిళలకు వంటచెరకు పొగనుంచి విముక్తి కల్పించేందుకు ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రారంభంలో 5 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించి పనిచేస్తున్నాం. ఈ పథకానికి పేద మహిళల్లో ఆదరణ పెరగటంతో ఈ లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచాలని నిర్ణయించాం’అని జైట్లీ పేర్కొన్నారు.
తొలి మూడేళ్ల వరకు ఈపీఎఫ్ 8 శాతమే!
మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నూతనంగా ఉద్యోగంలో చేరిన మహిళలు అధిక మొత్తంలో టేక్ హోమ్ శాలరీ (నికర జీతం) తీసుకునే విధంగా వెసులుబాటును ఇచ్చింది. ఉద్యోగ భవిష్యనిధిలో వీరి వాటా చెల్లింపును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్–1952’లో మార్పులు చేస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు.
ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులు తొలి మూడేళ్ల వరకు 8 శాతం ఈపీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటుగా సామాజిక భద్రత పథకాల్లో భాగంగా మూడేళ్లపాటు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అందరు ఉద్యోగులకు ఎంప్లాయర్ (యాజమాన్యం) వాటా ఈపీఎఫ్ 12 శాతాన్నీ ప్రభుత్వమే భరించే ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాన్ మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన కింద వస్త్ర, తోలు, ఫుట్‌వేర్ పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు పొందుతున్న ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రయోజనాన్ని మిగిలిన రంగాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఈ పథకం కింద ఇచ్చిన ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను ఇస్తున్నాయని జైట్లీ పేర్కొన్నారు.
స్వయం సహాయక బృందాలకు..
జాతీయ గ్రామీణ జీవన కార్యక్రమంలోని క్లస్టర్లలో స్వయం సహాయక బృందాలు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2019 మార్చి వరకు ఈ కార్యక్రమం కోసం ఇచ్చే రుణాలను రూ.75 వేల కోట్లకు పెంచుతున్నట్లు జైట్లీ వెల్లడించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలను గతేడాదితో పోలిస్తే 37 శాతం పెంచి.. రూ.42,500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, సుకన్య సమృద్ధి అకౌంట్ పథకాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని జైట్లీ పేర్కొన్నారు. ‘నవంబర్ 2017 వరకు బాలికల పేర్లతో 1.26 కోట్ల అకౌంట్లు దేశవ్యాప్తంగా తెరిచారని.. ఇందులో రూ.19,183 కోట్లు దాచుకున్నారు’అని ఆయన తెలిపారు.
బడ్జెట్ హైలైట్స్
► రూ.5 లక్షల కోట్ల అదనపు రుణాలు అందించేలా బ్యాంకు లకు మూలధన సాయం.
► ఎంపీల వేతనం, నియోజకవర్గ అలవెన్సు, ఆఫీసు ఖర్చులు, అలవెన్సుల్లో మార్పులకు ప్రతిపాదన. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి వేతనాల సమీక్షకు చర్యలు.
► 018–19 ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.2.82 లక్షల కోట్ల కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.67 లక్షల కోట్లు.
► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం రూ.150 కోట్లు కేటాయింపు.
► 2018 జనవరి 15 వరకూ ప్రత్యక్ష పన్నుల వసూలు 18.7 శాతం వృద్ధి.
► 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలపై కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు.
Comments
Please login to add a commentAdd a comment