విశ్లేషణ
జీఎస్టీని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను రేటు అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతి పెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి. ఒకే పన్ను అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధి కోసం జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.
దేశంలో ఏడేళ్ల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు దాని అమలుపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాల నివృత్తి జరక్కుండానే జీఎస్టీ అమలుకు నిర్ణయం తీసుకోవడం దుందుడుకు చర్యగా కొందరు అభివర్ణించారు కూడా!
అంతకు ఏడాది క్రితమే పెద్దనోట్ల రద్దు జరిగిందని, ఆ నష్టం నుంచి తేరుకోకముందే అరకొరగా జీఎస్టీని అమలు చేయడం సరికాదని వాదించారు. ఆర్థికవేత్తలు, పన్ను నిపుణులు చాలామంది జీఎస్టీ అమలు విఫలం కాక తప్పదన్న హెచ్చరికలూ జారీ చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను తోసిరాజని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందడుగు వేయడం తెలివైన పనే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అనుమానాలు తీర్చడంలో, జీఎస్టీలో భాగస్వాములైన వారందరి అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వడంలో ఏళ్లు పూళ్లు అవడం ఖాయం. కానీ ఒక్క విషయమైతే ఇక్కడ చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను ఉండాలన్న జీఎస్టీ లక్ష్యం పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలనూ దీని పరిధిలోకి తీసుకు రాగలిగితేనే నెరవేరు
తుంది.
జీఎస్టీపై సాధికార కమిటీ
దేశవ్యాప్తంగా ఒకే పన్ను అన్న అంశంపై సుమారు 18 ఏళ్లు చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు, రాష్టాల పన్నుల స్థానంలో ఒకటే పన్ను ఉండాలన్నది 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఆలోచన. విజయ్ కేల్కర్ నివేదిక ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా పన్ను వసూళ్లు మెరుగవుతాయని, ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. జీఎస్టీ అమల్లో ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు బాగున్నట్లు అప్పటికే జరిగిన పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. జీఎస్టీపై 2000లో ఆర్థిక మంత్రులతో కూడిన ఒక సాధికార కమిటీ ఏర్పాటైంది.
పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అసిమ్‌దాస్ గుప్తా ఆ కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటి జీఎస్టీ కౌన్సిల్ తొలి రూపం ఆ కమిటీనే. దాని సిఫారసులను అనుసరించి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఆదాయ వ్యవహారాల్లో ఏకాభిప్రాయ సాధన సూత్రాలుగా జీఎస్టీ కౌన్సిల్ పని చేస్తుంది. చర్చోపచర్చల తరువాత ఈ కమిటీ జీఎస్టీ బిల్లు తొలి ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందుకు సుమారు ఇరవై ఏళ్లు పట్టింది. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉండగా... 2016 నాటికి గానీ స్థూలమైన ఏకాభిప్రాయం కుదరలేదు.
మెరుగుపడిన పన్ను వసూళ్లు!
ఒకే ఒక్క పన్ను అన్న లక్ష్యంతో మొదలైన జీఎస్టీలో సంక్లిష్టతలు వచ్చేందుకు ఒక కారణం... తమ ఆదాయం పడిపోతుందన్న రాష్ట్రాల బెంగ. ఫలితంగా... ఒకే పన్ను స్థానంలో పలు రకాల పన్ను రేట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ, అంతర్రాష్ట్ర రవాణాపై సమీకృత జీఎస్టీ ఇలా పలు రకాల పన్నులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా... ఐదు నుంచి 28 శాతం వరకూ నాలుగు విభాగాల పన్ను రేట్లను నిర్ధారించారు. అంతేకాదు... తమకు అత్యధిక ఆదాయాన్నిచ్చే పెట్రోలు, మద్యం జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండాలని రాష్ట్రాలు పట్టుబట్టాయి. జీఎస్టీ అమలు సమయంలో ఈ పన్ను ద్వారా తగినంత ఆదాయం వస్తుందా? అన్న అనుమానాలు రాష్ట్రాలకు ఉండేది. అయితే ఈ అనుమానాలు వట్టివేనని తేలిపోయింది. వాస్తవానికి పన్ను వసూళ్లు మునుపటి కంటే బాగా మెరుగయ్యాయి.
జీఎస్టీ తాజా గణాంకాలను పరిశీలిస్తే గత జూన్ నెలలో వసూళ్లు 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తొలి ఏడాది ఈ మొత్తం నెలకు 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రాల సొంత ఆదాయం కూడా జీఎస్టీ అమలు తరువాత పెరిగినట్లు ఆర్‌బీఐ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. అంటే... రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో ఏర్పాటు చేసిన కాంపెన్సేషన్ లేకుండా సొంత ఆదాయాలతోనే వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ కాంపెన్సేషన్ అనేది ముందు ఐదేళ్లు ఉంటుందని అనుకున్నారు కానీ... కోవిడ్ కారణంగా 2026 వరకూ పొడిగించారు. ఆదాయం ఇప్పటి మాదిరే పెరుగుతూ ఉంటే ఈ ఏర్పాటును రద్దు చేయవచ్చు.
చిన్న వ్యాపారులకు మేలే జరిగింది!
మొత్తమ్మీద జీఎస్టీ అమలులో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయన్నది వాస్తవం. పద్ధతులను సులువు చేసే విషయంలో, మరీ ముఖ్యంగా రెడ్‌టేప్‌ను తగ్గించడంలో! అయితే ఇతర సమస్యలేవైనా వచ్చినా వాటి పరిష్కారం కోసం రాష్ట్రాలు తరచూ జీఎస్టీ కౌన్సిల్ రూపంలో సమావేశమవుతూండటం గమనార్హం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం ఎలా అనే సవాలును కంప్యూటర్ల సాయంతో అధిగమించారు. జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతుందని కొంతమంది భయపడ్డారు కానీ.. వాస్తవానికి జరిగింది మేలే. లక్షలాది చిన్న వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయారు.
జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు
జీఎస్టీ అమలుతో సామాన్యులపై పన్ను భారం ఎక్కువ అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కానీ దీనికి కూడా సరైన హేతువు ఏదీ లేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. వినియోగమవుతున్న వస్తువుల్లో 60 శాతం వాటికి అతి తక్కువ పన్ను రేట్లు (సున్నా లేదంటే ఐదు శాతం) ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కేవలం మూడు శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం అత్యధిక పన్ను పడుతోంది. అయినా ఒక్క విషయాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ పన్ను రేట్లను మరింతగా హేతుబద్ధీకరించాలి. ఒకే పన్ను రేటు అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు.
ఇక రెండో అంశం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు, భూమి వంటి వాటిని కూడా చేర్చాలన్న వాదన ఉంది. తొలి దశలో భాగంగా వైమానిక ఇంధనం, సహజవాయువులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెట్రోలు, డీజిళ్లను కూడా చేర్చడం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఆదాయ వనరుగా ఉండటం వల్ల మద్యం అమ్మకాలపై జీఎస్టీ అనేది కొంచెం సున్నితమైన అంశం అవుతుంది. అయితే నేడు కాకపోతే రేపు అయినా సరే... ఈ మార్పు అనివార్యం.
అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరం
జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి సమావేశాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు జరిగాయి. జీఎస్టీకి ముందు కాలం నాటి వివాదాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. అదే సమయంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని కూడా కౌన్సిల్ గుర్తించింది. జీఎస్టీ అమలును మరింత సమర్ధంగా మార్చేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే.
అదే సమయంలో ఒకే పన్ను అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతిపెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.
సుష్మా రామచంద్రన్
వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment