పన్నుల శాఖలోని కీలక అధికారులపై తీవ్ర ఆరోపణలు
ప్రధాని కార్యాలయం వరకు వెళ్లిన వ్యవహారం.. ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు?
గాడి తప్పిన పాలన వ్యవస్థ.. పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం
అంతర్గత లావాదేవీల్లోనూ అవకతవకలు.. ఆడిట్‌ల పునఃపరిశీలనకు కమిషనర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పట్టుకొమ్మ లాంటి పన్నుల శాఖ.. కొన్నిరోజులుగా ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులతో కునారిల్లుతోంది. ముఖ్యంగా ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న వారిపై ఏకంగా ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పన్నుల శాఖలో పాలన గాడి తప్పడం, ఎవరు ఏం చేస్తున్నారన్న దానిపై పర్యవేక్షణ కొరవడటంతో.. ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు అధికారులు, వ్యాపారుల జేబుల్లోకి వెళుతున్నాయని అంటున్నాయి.
మరోవైపు శాఖలోని అంతర్గత లావాదేవీల్లో కూడా అవినీతి గుప్పుమంటోందని, ఇటీవల జరిగిన ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ.. ఈ ఆరోపణలు, విమర్శలపై ఫోకస్ చేశారు. మూడు రోజులుగా అన్నిస్థాయిల్లోని అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ విభాగమే కీలకం
పన్నుల శాఖ అదనపు కమిషనర్ నేతృత్వంలో డిప్యూటీ కమిషనర్లు, సీటీవోలు, డీసీటీవోలు, ఏసీటీవోలు కలిపి 20 మంది వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తుంటారు. రాష్ట్రంలో పన్ను కట్టాల్సిన వ్యాపారాలన్నింటిపై ఈ విభాగం నిఘా పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు వేబిల్లులు చూపించి లేదా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం చేస్తున్నవారు, వ్యాపార లావాదేవీలను తక్కువగా చూపించే డీలర్లు, తప్పుడు బిల్లులతో ఐటీసీ క్లెయిమ్ చేసుకునేవారు, కోట్ల టర్నోవర్ చేసి అకస్మాత్తుగా మాయమయ్యే వ్యాపారులపై నిఘా పెట్టి.. వారి నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులదే.
అయితే గత పదేళ్లలో ఈ విభాగంలో పనిచేసిన వారిలో చాలా మంది అధికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అవినీతి మరకలు కొత్తేమీ కాదు. కానీ ఈ విభాగంలో పనిచేస్తూ రిటైరైన ఏడేళ్ల తర్వాత కూడా ఓ అధికారి పింఛన్ ఇంతవరకు సెటిల్ కాలేదంటే.. ఏ స్థాయిలో ఆరోపణలు వచ్చాయో, ఎన్ని కేసులు అయ్యాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
ప్రభుత్వ ఖజానాకు దెబ్బకొడుతూ..
పెద్ద పెద్ద వ్యాపారులపై ఫోకస్ చేసి, వారి పన్ను చెల్లింపుల్లో తప్పులను పట్టుకుని, విచారణ పేరిట బెదిరించడం.. నామమాత్రంగా పన్ను కట్టించి, మిగతా మొత్తంలో కొంత కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బందికి పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వారు ఎక్కడా దొరక్కుండా మ్యాన్యువల్ నోటీసులు ఇవ్వడం.. షోకాజ్ నోటీసు, డిమాండ్ నోటీసు వంటి వాటికి కూడా ఆన్‌లైన్ ఆథరైజేషన్ లేకుండా చేయడం ద్వారా తమ తతంగాన్ని పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్ చేయాల్సిన క్షేత్రస్థాయి పరిశీలనలు, దాడులు, వాహనాల తనిఖీలు వంటివి పన్నుల శాఖలో మచ్చుకైనా కనిపించవు. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ విభాగంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు అధికారుల అవినీతి లీలలను వివరిస్తూ, చర్యలు తీసుకోవాలంటూ పన్నుల శాఖలోని వారే ప్రధాని కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గతంలో పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసిన టీకే శ్రీదేవి అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా చిన్న ప్రయత్నం చేస్తేనే నెలకు రూ.200 కోట్ల వరకు పన్ను రాబడి పెరిగిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అదే ఎన్‌ఫోర్స్‌మెంట్ పనితీరు సరిగ్గా ఉంటే ఏటా ఏడెనిమిది వేల కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావొచ్చని అంటున్నాయి.
అందరూ హైదరాబాద్ చుట్టూనే..
పన్నుల శాఖ పరిధిలో సర్కిల్ స్థాయిలో కీలకంగా వ్యవహరించే సీటీవోల వ్యవహారం మరింత విస్తుగొలుపుతోంది. పదోన్నతులు పొంది శిక్షణలో ఉన్న వారు కాకుండా ప్రస్తుతం 85 మంది వరకు పన్నుల శాఖలో సీటీవోలుగా ఉన్నారు. వీరిలో 80 మందికిపైగా హైదరాబాద్‌లోనే పనిచేస్తుండటం గమనార్హం. కేవలం నలుగురైదుగురు సీటీవోలు మాత్రమే జిల్లాల్లో పనిచేస్తున్నారని.. హైదరాబాద్ తర్వాత పన్ను రాబడికి ప్రధాన కేంద్రాలైన వరంగల్, కరీంనగర్‌లలోనూ రెగ్యులర్ సీటీవోలు లేరని సమాచారం. హైదరాబాద్‌లో ఉంటే అటు ఆదాయం పెరగడంతో ఇటు శాఖాపరమైన ఒత్తిడి తగ్గుతుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఇక్కడే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారనే చర్చ పన్నుల శాఖలో జరుగుతోంది.
కొనుగోళ్లలోనూ అవకతవకలు!
పన్నుల శాఖలోని అంతర్గత లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన 200 ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, దీనిపై కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిసింది. ‘శాఖ ఆడిట్‌లోని లోపాలతోపాటు, ఆదాయం తక్కువ వచ్చేందుకు కారణాలు, ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారు? ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం తీసుకువచ్చారు?’అనే అంశాలపై ఆయన మూడు రోజులుగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్న అధికారుల వివరాలు సేకరిస్తున్న ఆయన.. త్వరలోనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని పన్నులశాఖ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆడిట్‌లను పునఃసమీక్షించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment