
అధిక లాభాల ఆశ చూపించి రూ.850 కోట్ల మోసం
మనీలాండరింగ్ ఉల్లంఘన నేపథ్యంలో ఈడీ నిర్ణయం
విచారణ చేపట్టాలని ఈడీకి లేఖ రాసిన సైబరాబాద్ పోలీసులు
ప్రధాన నిందితుడుఅమర్‌దీప్.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి ఏకంగా రూ.850 కోట్లు దోచుకున్న ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (ఎఫ్‌ఐడీ) కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టనుంది. మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో సుమారు 7 వేల మంది నుంచి డిపాజిట్లను సేకరించి.. ఆ సొమ్మును సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి దేశాల్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసుల దర్యాప్తులో తేలింది. మనీలాండరింగ్ ఉల్లంఘనల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఈడీకి లేఖ రాసినట్లు తెలిసింది.
రిటైర్డ్ ఆర్మీ అధికారి కొడుకే..
ప్రధాన నిందితుడు ఎఫ్‌ఐడీ చైర్మన్ అమర్‌దీప్ కుమార్ బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో స్థిరపడిన అమర్ కుటుంబం బహుళజాతి కంపెనీలకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అందించే సంస్థను స్థాపించడం ద్వారా అమర్‌దీప్ వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఈ ఏజెన్సీకి దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా ఉద్యోగులున్నారు.
2020లో అమర్‌దీప్ ఎఫ్‌ఐడీ సంస్థను స్థాపించి, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సామాన్యుల నుంచి డిపాజిట్లను సేకరించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న అమర్, సీఈఓ యోగేందర్ సింగ్, సీఓఓ ఆర్యన్ సింగ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుక్ ఔట్ సర్క్యులర్‌ను సైతం జారీ చేశారు.
సామాన్యుల నుంచి సేకరించిన డిపాజిట్లను మళ్లించేందుకు నిందితులు కాయిన్ ట్రేడ్, బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, యుకియో రిసార్ట్, ప్రెస్టిజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టిస్ వంటి 15 షెల్ కంపెనీలను స్థాపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. డిపాజిట్లను క్రిప్టోకరెన్సీతో సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి విదేశాల్లోని ఈ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేల్చారు. అక్కడ్నుంచి నిందితుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు సొమ్ము చేరినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment