న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపించేలా ప్రజలపై పన్నులు విధిస్తోంది. పెంచుకునే కోళ్లు, ఆవులు, ఇతర పెంపుడు జంతువుల మీద పన్నులు చెల్లించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలపై గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటువంటి పన్నులను చెల్లించేది లేదని తెగేసి చెప్పారు.
పాకిస్తాన్ ప్రభుత్వానికి గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు షాక్ ఇచ్చారు. చిరువర్తకుల వ్యాపారాలపై పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా విధించిన పన్నును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నాడు వేల సంఖ్యలో ప్రజలు దుకాణాలు మూసివేసి రోడ్లమీదకు వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై అక్రమ పన్నులు విధిస్తోందని.. ప్రజలు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా బిల్గిత్, బల్టిస్తాన్‌లలో వ్యాపారులు పూర్తిగా దుకాణాలు మూసివేశారు. పన్నులను ఉపసంహించేంతవరకూ అంతేకాక ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేదిలేదని వ్యాపారులు తేల్చి చెప్పారు.
ఇళ్లలో పెంచుకునే కోళ్లమీద, పాడి ఆవులు, బర్రెల మీద మేం పన్నులు చెల్లించాలా? ఇంట్లో 5 మందికన్నా అధికంగా ఉంటే పన్నులు కట్టాలా? ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉంటాయా? అని స్కుర్దు ప్రజలు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. రేప్పొద్దున గడ్డం పెంచకపోతే పన్ను.. పెంచితే పన్ను వేస్తారేమోనని వ్యగ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పన్నులను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేది లేదని.. అవసరమైతే.. ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తామని గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment