రెండు రోజులు ఆలస్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా అందరికీ అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటూ.. ‘‘గడువు తేదీ’’ని కేవలం ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు వేసే కోణంలోనే పరిశీలిద్దాం.
2024 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరపు రిటర్నులు వేయడానికి గడువు తేదీ 2024 జూలై 31. మీలో చాలా మంది సకాలంలో వేసి ఉంటారు. ఈసారి రిటర్నులు వేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డిపార్టుమెంటు వారు చెప్తున్నారు. అనారోగ్యం కానివ్వండి. విదేశాయానం కానివ్వండి. కారణం ఏదైనా కానివ్వండి. మీరు రిటర్ను ఇంకా వేయలేదా? చింతించకండి. బెంగ వద్దు. ఇలాంటి వారికి చక్కని రాజమార్గం ఉంది. లేటు ఫీజు కట్టాలి. ఇలా లేటు ఫీజు చెల్లించినవారికి 2024 డిసెంబర్ 31 వరకు గడువు తేదీ ఉన్నట్లు లెక్క. అంటే మరో రెండు నెలల పదిహేను రోజులు. అలా అని ఆలస్యం చేయకండి.
ఎంత లేటు ఫీజు చెల్లించాలి..
ఆలస్యమైన నెలలతో సంబంధం లేకుండా రెండు రకాల నిర్దేశిత రుసుములు ఉన్నాయి. పన్నుకి గురయ్యే ఆదాయం.. రూ. 5,00,000 లోపల ఉంటే రూ. 1,000 చెల్లించాలి. పన్నుకి గురయ్యే ఆదాయం రూ. 5,00,000 దాటి ఉన్నట్లయితే, ఫీజు రూ. 5,000 ఉంటుంది. ఇవి మారవు. అంటే మీరు ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 లోపల ఎప్పుడు దాఖలు చేసినా రుసుములంతే. అయితే, పన్ను చెల్లించాల్సి ఉంటే వడ్డీ విధిస్తారు. ఇది నెలకు 1 శాతం చొప్పున వడ్డిస్తారు.
రిఫండు క్లెయిమ్ చేసినా అప్పటికి పన్ను చాలా చెల్లించినట్లయితే, ఈ వడ్డీ పడదు. పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే మీరు తొందరపడాల్సి ఉంటుంది. వడ్డీని తగ్గించుకోవచ్చు. మీరు బయటి నుంచి 1 శాతం వడ్డీతో అప్పు తెచ్చి పన్ను భారం చెల్లించే బదులు ఆ వడ్డీ మొత్తం ఏదో ‘సీతమ్మగారి పద్దు’లో పడేలా ప్లాన్ చేసుకోండి. మీ ఆర్థిక వనరులను ప్లాన్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి. ఈ వెసులుబాటనేది ‘తత్కాల్’ టిక్కెట్టు కొనుక్కుని రైల్లో ప్రయాణం చేసినట్లు ఉంటుంది.
అయితే, రిటర్ను గడువు తేదీలోగా దాఖలు చేయకపోవడం వల్ల రెండు పెద్ద ఇబ్బందులు తలెత్తుతాయి. వీటి విషయంలో ఎలాంటి వెసులుబాటు లేదు. గడువు తేదీ లోపల రిటర్ను వేసేవారికి డిపార్టుమెంటు రెండు ప్రయోజనాలు పొందుపర్చింది. ఆ రెండు ప్రయోజనాలూ లేటు విషయంలో వర్తించవు. ఇంటి మీద ఆదాయం లెక్కింపులో మనం లోన్ మీద వడ్డీని నష్టంగా పరిగణిస్తాం.
ఆ నష్టాన్ని పరిమితుల మేరకు సర్దుబాటు చేసి, ఇంకా నష్టం మిగిలిపోతే దాన్ని రాబోయే సంవత్సరాలకు బదిలీ చేసి, నష్టాన్ని.. ఆదాయాన్ని సర్దుబాటు చేస్తాం. దీని వల్ల రాబోయే సంవత్సరంలో పన్ను భారం తగ్గుతుంది. ఇది చాలా ప్రయోజనకరంగా, ఉపశమనంగా ఉంటుంది. లేటుగా రిటర్ను వేస్తే ఈ ‘బదిలీ’ ప్రయోజనాన్ని ఇవ్వరు. ఈ సదుపాయాన్ని శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుంది.
ఇక రెండోది.. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పద్ధతి లేదా కొత్త పద్ధతుల్లో.. మనం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సాధారణంగా పన్ను తగ్గే పద్ధతి ఎంచుకుంటాం. మనం గడువు తేదీ లోపల రిటర్ను వేయకపోతే, ఇలా ఎంచుకునే అవకాశం ఇవ్వరు. కంపల్సరీగా కొత్త పద్ధతిలోనే పన్నుభారాన్ని లెక్కించాలి. అయినా, రిటర్ను వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
1. ఇది మీ ఆదాయానికి ధృవపత్రం అవుతుంది
2. రుణ సౌకర్యం లభిస్తుంది
3. విదేశీయానం అప్పుడు వీసాకి పనికొస్తుంది
4. చట్టంలో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు
5. పెనాల్టీ మొదలైనవి ఉండవు కాబట్టి రిటర్నులు వేయండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment