ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ పొరపాట్లు, తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తప్పులు ఆదాయపు పన్ను శాఖ నుంచి పెద్ద మొత్తంలో జరిమానాలు, నోటీసులకు దారి తీయవచ్చు. ఐటీఆర్ దాఖలును విస్మరించడం, ఆదాయాన్ని తక్కువగా, తప్పుగా చూపించడం వంటి వాటికి పాల్పడిన సుమారు లక్ష మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తెలిపారు.
అటువంటి నోటీసులకు, జరిమానాలకు గురికాకూడదంటే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ సూచన మేరకు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీ శాఖ నోటీసులకు, జరిమానాలకు గురి చేసే అవకావం ఉన్న కొన్ని సాధారణ తప్పులు ఇక్కడ తెలియజేస్తున్నాం. వాటిని గుర్తించి ఆ తప్పులు లేకుండా ఐటీఆర్ దాఖలు చేయండి.
సరికాని ఐటీఆర్ ఫారం ఎంపిక
మీ ఆదాయ స్వభావం, పన్ను చెల్లింపుదారుల వర్గం ఆధారంగా తగిన ఐటీఆర్ ఫారమ్‌ను జాగ్రత్తగా ఎంచుకోండి. తప్పు ఫారమ్‌ను ఉపయోగించడం వలన మీ రిటర్న్ లోపభూయిష్టంగా మారవచ్చు. ఉదాహరణకు, జీతం పొందే వ్యక్తులు ఐటీఆర్ ఫారం-1ని ఫైల్ చేయాలి. మూలధన లాభాల ద్వారా ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ ఫారం-2ని ఉపయోగించాలి.
ఫారమ్ 26AS, టీడీఎస్ సర్టిఫికేట్‌ను విస్మరించడం
మీ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఫారమ్ 26ASని పూర్తిగా ధ్రువీకరించండి. ఈ పత్రంలో ముఖ్యమైన ఆదాయ వివరాలు, పన్ను మినహాయింపులు, ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ అసెస్‌మెంట్ పన్నుతోపాటు అర్హత కలిగిన పన్ను క్రెడిట్‌లు ఉంటాయి. ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఫారం 16తో సరిచూసుకోవడం అవసరం. దీంతోపాటు వార్షిక సమాచార ప్రకటన (AIS)తో కూడా చెక్ చేసుకోండి. ఐటీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఈ రెండు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధిక విలువ లావాదేవీలను దాచడం
మీరు ఆదాయ వివరాల్లో ఆస్తి కొనుగోళ్లు లేదా గణనీయమైన క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలను దాచిపెడతే ఐటీ శాఖ నోటీసు జారీ చేయవచ్చు. ఈ లావాదేవీల కోసం ఉపయోగించిన నిధుల మూలానికి సంబంధించి వారు వివరణ కోరవచ్చు. వ్యత్యాసాలను నివారించడానికి, మీ ఖర్చు, నివేదించిన ఆదాయం మధ్య స్థిరత్వం ఉండేలా చూసుకోండి.
బోగస్ తగ్గింపులు, క్లెయిమ్‌లు
మీకు వర్తించని తగ్గింపులను క్లెయిమ్ చేయొద్దు. ఉదాహరణకు, మీరు పనిచేసే సంస్థ జారీ చేసిన ఫారమ్ 16లో పేర్కొన్నదానికి విరుద్ధంగా హెచ్‌ఆర్‌ఏ లేదా సెక్షన్ 80C వంటి తగ్గింపులను క్లెయిమ్ చేస్తే ఐటీ శాఖ కచ్చితంగా దృష్టి పెడుతుంది. వీటిపై విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది.
తప్పుడు వ్యక్తిగత సమాచారం
మీ రిటర్న్‌లో పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, పాన్, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను అందించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ వివరాలు వాస్తవ, తాజా సమాచారంతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. సరైన బ్యాంక్ వివరాలను అందించకపోతే అర్హమైన పన్ను రీఫండ్‌లను పొందడంలో జాప్యం జరుగుతుంది.
గడువు తేదీని దాటిపోవడం
జరిమానాలను నివారించడానికి గడువు తేదీ జూలై 31లోపు మీ ఐటీఆర్‌ని ఫైల్ చేయండి. ఒక వేళ గడువు మించిపోతే రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు ఆలస్య రుసుము, నెలకు 1 శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం వలన ట్యాక్స్ రీఫండ్ పొందడం కూడా ఆలస్యమవుతుంది.
ఆదాయ మార్గాలను దాచడం
మీ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అన్ని ఆదాయ మార్గాలను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. మీరు జీతం పొందే వ్యక్తి అయినప్పటికీ, పన్ను నుంచి మినహాయించిన వాటితో సహా ఏదైనా ఇతర ఆదాయాన్ని పొందుతుంటే తప్పనిసరిగా ప్రకటించాలి. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అవగాహన లోపం కారణంగా మినహాయింపు ఆదాయ వివరాలను అనుకోకుండా వదిలేస్తుంటారు.
అసెస్‌మెంట్ సంవత్సరాన్ని తప్పుగా ఎంచుకోవడం
మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు మీరు ఆదాయాన్ని ఆర్జించిన ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించే తగిన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకున్నారో లేదో నిర్ధారించుకోండి. ఈ సంవత్సరం అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ కోసం అసెస్‌మెంట్ ఇయర్ 2023-2024 అవుతుంది.
ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment