ఆదాయపు పన్ను రీఫండ్ ప్రాసెసింగ్ ఇప్పుడు వేగంగా మారింది. ట్యాక్స్ రీఫండ్‌ల కోసం వారాల పాటు వేచి ఉండాల్సి పని లేదు. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌కు గానూ ఇటీవల తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేసిన చాలా మందికి కొన్ని రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్ వచ్చింది.
తాను ఐటీఆర్ ఫైల్ చేసిన 12 గంటల్లోనే ట్యాక్స్ రీఫండ్ పొందినట్లు ఓ పన్ను చెల్లింపుదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన నిర్ణయ్ కపూర్ అనే ట్విటర్ యూజర్ తన ఐటీఆర్ ఫైలింగ్, ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు. ట్యాక్స్ రీఫండ్‌ను ఇంత వేగంగా ప్రాసెస్ చేయడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాసుకొచ్చారు. నిర్ణయ్ కపూర్ జూలై 27 ఉదయం తన ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయగా అదే రోజు సాయంత్రంలోగా ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.
ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
ట్యాక్స్ ఫైలింగ్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఐటీఆర్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెసింగ్‌లో వేగం పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఐటీఆర్‌లు దాఖలు చేసిన ఒక్కరోజులోనే ప్రాసెస్ చేయడం గతేడాదితో పోలిస్తే వంద శాతం పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు.
ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారు రిఫండ్ ప్రాసెసింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్యాక్స్ నిపుణలు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్యవస్థ ఇప్పుడు చాలా వేగంగా మారిందని, పన్ను చెల్లింపుదారులు ముందస్తు రీఫండ్‌కు అర్హులు కావాలంటే వీలైనంత త్వరగా తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలని సూచిస్తున్నారు.
ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా మందికి తెలియని మరో ప్రయోజనం కూడా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రీఫండ్‌పై నెలకు 0.5 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తుందని తెలిసిందే. అయితే మీరు ఐటీఆర్ దాఖలు చేసినప్పటి నుంచి ఇది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆ ప్రయోజనం పొందవచ్చు.
ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి గడువు తేదీ జూలై 31. కాగా జూలై 27 వరకు, 5 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలయ్యాయి. అలాగే ఇప్పటికే 2.69 కోట్ల వెరిఫైడ్ ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment