What Happens If You Failed To File The ITR Before Deadline? - Sakshi
Sakshi News home page

ITR Filing : డెడ్‌లైన్‌ లోపు ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకపోతే ఏమవుతుంది?

Published Mon, Jul 31 2023 11:49 AM | Last Updated on Mon, Jul 31 2023 12:33 PM

 What Happens Taxpayer Fails To File The Itr Before The End Of The Deadline - Sakshi

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు ఈ రోజుతో ముగియనుంది. పలు నివేదికల ప్రకారం.. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపు దారులు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఫైలింగ్‌ చేస్తున్నా కావడం లేదని, జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్‌ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్‌ పోర్టల్‌ పనితీరు బాగుంది. ఫైలింగ్‌ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చు’ అని ట్వీట్‌ చేసింది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌లైన్‌ జులై 31లోపు ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

లేట్‌ ఫీ
పన్నులు చెల్లింపు దారులు ఐటీ శాఖ ఇచ్చిన గడువులోపు ట్యాక్స్ ఫైలింగ్‌ చేయకపోతే లేట్‌ ఫీ రూ.5,000 చెల్లించాలి. అనతరం డిసెంబర్‌ 31లో మరో సారి ఐటీఆర్‌లు దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి (రూ.3లక్షల) కంటే తక్కువగా ఉంటే  పన్ను చెల్లింపుదారులకు లేట్‌ ఫీ ఛార్జీలు వర్తించవు.  
.
వడ్డీ 
ఒకవేళ, రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరిగితే ట్యాక్స్‌ పేయర్స్‌ చెల్లించే పన్నులో నెలకు 1 శాతం చొప్పున ఆదాయపు పన్ను శాఖ వడ్డీని వసూలు చేస్తుంది. ఒక కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు అమ్మకందారు వసూలు చేసే ట్యాక్స్‌ టీసీఎస్, జీతాలు, కమీషన్, వడ్డీలు, డివిడెంట్లు ఇలా వివిధ రకాల ఆదాయ వనరులపై విధించే ట్యాక్స్ టీడీఎస్‌, ముందస్తు పన్ను, చట్టం క్రింద లభించే ఇతర ట్యాక్స్‌ రిలీఫ్‌/ట్యాక్స్‌ క్రెడిట్‌ల తగ్గింపు తర్వాత నికర ఆదాయంపై విధించే పన్నుపై వడ్డీ వర్తిస్తుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒక రోజు ఆలస్యానికి కూడా ఒక నెల వడ్డీ వసూలు చేస్తారు.

ట్యాక్స్‌ మినహాయింపు ఉండదు
నిర్ణీత గడువులోగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్ సంవత్సరాల్లో ట్యాక్స్‌ మినహాయింపు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటితో పాటు హౌస్‌ ప్రాపర్టీ, ఇతర విభాగాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోలేము. 

జరిమానా, జైలు శిక్ష
జరిమానాలతో పాటు, పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. చెల్లించాల్సిన పన్ను లేదా, ఎగవేత రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేస్తే , 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
 
ట్యాక్స్‌ రిఫండ్‌ లేనట్లే  
టీడీఎస్, అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్‌ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. అదీ సకాలంలో ఐటీఆర్‌ ఫైల్‌ చేసినప్పుడే. సమయానికి ఐటీఆర్‌ ఫైల్ చేయకపోవడం వల్ల ట్యాక్స్‌  రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి ➤ ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్‌ ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement