కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్లుగా గవర్నర్ తనవద్దనే నిలిపి ఉంచడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషమాన్ని పరిశీలించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రెండు సంవత్సరాలుగా బిల్లును ఎందుకు తొక్కిపెట్టారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లులను గత రెండేళ్లుగా గవర్నర్ ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించింది.
అంతకుముందు గవర్నర్ కార్యాలయం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. మొతం 8 బిల్లుల్లో ఏడింటిని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌లో ఉంచారని, మరో బిల్లుకు గవర్నర్ మహమ్మద్ ఖాన్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నోట్ చేసుకున్న సీజేఐ.. గత రెండేళ్లుగా బిల్లులను గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ బదులిస్తూ.. అనే సందేహాలను లేవనెత్తే ఆ వివరాల్లోకి వెళ్లదలచుకోలేదని తెలిపారు.
అయితే ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీ అయిన తమకు ఆ వివరాలు అవసరమనని జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను ఎప్పుడూ పంపించాలనే విషయంలోనూ మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కోరారు.
చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..
రాష్ట్రంలో పాలనను నిలిపివేసేలా గవర్నర్లు బిల్లులను తొక్కిపెట్టడాన్ని అనుమతించకూడదని తెలిపారు. అసెంబ్లీతో కలిసి పని చేయకుండా గవర్నర్ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గడువులోగా ఆమోదం తెలిపేందుకు లేదా తిరస్కరించేందుకు రాష్ట్ర గవర్నర్‌లకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను సవరించేందుకు కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
విచారణను ఇక్కడితో ముగిద్దామనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇదో సజీవ సమస్యగా పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గవర్నర్‌కు పలు కీలక సూచనలు చేసింది. బిల్లుపై సందేహాలు ఉంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్, సంబంధిత మంత్రితో గవర్నర్ చర్చిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అలా జరగని పక్షంలో రాజ్యాంగం అప్పగించిన విధులను నిర్వర్తించడానికి చట్టబద్దమైన విధానాల ఖరారుకు తాము సిద్దంగా ఉంటామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment