
ఇల్లంతకుంట: ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాక పోవడంతో మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే ఆనందరెడ్డి (48) 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రూ.18 లక్షల వరకు వెచ్చించి సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు నిర్మించారు.
వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఏడాదిన్నరగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం కోసం రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం 30 లక్షల రూపాయల వరకు అప్పు అయ్యింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు విడుదల కాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నట్లు పొలం వద్ద నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు.
వెంటనే అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులకు ఆనందరెడ్డి కొనఊపిరితో కనిపించారు. ఇల్లంతకుంటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పద్మ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment