illantakunta
-
రూ.30 లక్షల అప్పు.. సర్పంచ్ ఆత్మహత్య
ఇల్లంతకుంట: ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాక పోవడంతో మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే ఆనందరెడ్డి (48) 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రూ.18 లక్షల వరకు వెచ్చించి సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు నిర్మించారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఏడాదిన్నరగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం కోసం రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం 30 లక్షల రూపాయల వరకు అప్పు అయ్యింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు విడుదల కాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నట్లు పొలం వద్ద నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులకు ఆనందరెడ్డి కొనఊపిరితో కనిపించారు. ఇల్లంతకుంటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పద్మ ఆరోపించారు. -
ఆలయ చైర్మన్ రాసలీలలు!
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఆయన అధికారపార్టీలో ఓ ముఖ్యనేత. పైగా శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ కమిటీకి చైర్మన్. నలుగురికి మంచి చెప్పాల్సిందిపోయి వక్రమార్గం పట్టాడు. ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆమె భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మబలికి ఆ మహిళకు సంబంధించిన భూమిని అమ్మిచ్చి.. ఏకంగా రూ.మూడు లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగమైనా పెట్టించాలని, లేకుంటే తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగితే తనకు బడా నాయకులు తెలుసని, దిక్కున్న చోట చెప్పుకోమ్మంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీసులు సైతం చైర్మన్‌కే వత్తాసు పలుకుతూ.. ఫిర్యాదులో మార్పు చేయాలని హుకూం జారీ చేశారు. దీంతో చేసేది లేక సదరు మహిళ మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌గా ఎక్కటి సంజీవరెడ్డి కొనసాగుతున్నాడు. మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి కల్లు తాగేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు అధికారులు, బడా నాయకులు తెలుసని పేర్కొంటూ సదరు మహిళా భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన మహిళ రెండేళ్లక్రితం వారికున్న 20 గుంటల భూమిని విక్రయించగా వచ్చిన రూ.మూడు లక్షలు సంజీవరెడ్డికి ఇచ్చింది. రెండేళ్లయినా ఉద్యోగం కల్పించకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అందరికీ చెబుతానని తీవ్రంగా కొట్టాడు. ఆ సమయంలో అడ్డుగా వచ్చిన ఆమె భర్తపైనా దాడికి పాల్పడ్డాడు. తన మాట వినాలని, లేకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించాడు. ఈ విషయమై స్థానికంగా కొద్దిరోజులుగా పంచాయితీలు కూడా నడుస్తున్నట్లు సమాచారం. పట్టించుకోని పోలీసులు.. తనపై, తన భర్తపై దాడి చేశాడని పేర్కొంటూ.. సదరు మహిళా న్యాయం కోసం ఇల్లందకుంట పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కనీసం పట్టించుకోలేదు. సంజీవరెడ్డి పెద్ద హోదాలో ఉన్నాడని, ఆయనపై ఇచ్చిన ఫిర్యాదును మార్పు చేయాలంటూ ఎస్సై నరేశ్‌కుమార్ నాలుగు గంటలపాటు ఒత్తిడి తెచ్చారని మహిళ మీడియా ఎదుట వాపోయింది. వివాహేతర సంబంధం కాకుండా భార్యాభర్తలు కౌన్సెలింగ్ కోసం వచ్చినట్లు రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. ఈ విషయమై ఎస్సై నరేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సంజీవరెడ్డి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు.. డబ్బులు కూడా ఇచ్చేది ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చిందని, పూర్తి సమాచారం తెలుసుకునేందుకే కొంత సమయం తీసుకున్నానని, ఫిర్యాదును మార్చాలని తాను మహిళపై ఒత్తిడి తేలేదని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా
ఎంపీ వినోద్‌కుమార్ ఇల్లంతకుంటలో సబ్‌పోస్టల్ కార్యాలయం ప్రారంభం ఇల్లంతకుంట: అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ఎజెండా అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శనివారం ఇల్లంతకుంటలో సబ్‌పోస్టల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ పథకాలను ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన∙సేవలందించేందుకే ఇల్లంతకుంటలో సబ్‌పోస్టల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. సుకన్య యోజన పథకం ద్వారా ఆడపిల్లల పేరుమీద 14 ఏళ్లు డబ్బులు జమచేస్తే 20 సంవత్సరాలకు రెట్టింపు వస్తాయన్నారు. మెరుగైన పాలన అందించేందుకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పోస్టల్ సూపరిండెంట్ పండరి, ఎంపీపీ ఐలయ్య, జెడ్పీటీసీ సిద్దం వేణు, మార్కెట్ చెర్మన్ సరోజన, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ సంజీవ్, సింగిల్‌విండో చెర్మన్లు రాఘవరెడ్డి, రవిందర్‌రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ పాల్గొన్నారు. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఆంగ్లబోధనపై ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి మెరుగైన విద్యనందిస్తే ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్లరని తెలిపారు. సమయపాలన పాటించి నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని సూచించారు.