ఆలయ చైర్మన్‌ రాసలీలలు! | woman accuses temple chairmen harassed her family | Sakshi
Sakshi News home page

ఆలయ చైర్మన్‌ రాసలీలలు!

Published Wed, Jul 25 2018 8:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:20 PM

woman accuses temple chairmen harassed her family - Sakshi

ఇల్లందకుంట(హుజూరాబాద్‌):  ఆయన అధికారపార్టీలో ఓ ముఖ్యనేత. పైగా శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ కమిటీకి చైర్మన్‌. నలుగురికి మంచి చెప్పాల్సిందిపోయి వక్రమార్గం పట్టాడు. ఓ మహిళతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆమె భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మబలికి ఆ మహిళకు సంబంధించిన భూమిని అమ్మిచ్చి.. ఏకంగా రూ.మూడు లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగమైనా పెట్టించాలని, లేకుంటే తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగితే తనకు బడా నాయకులు తెలుసని, దిక్కున్న చోట చెప్పుకోమ్మంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీసులు సైతం చైర్మన్‌కే వత్తాసు పలుకుతూ.. ఫిర్యాదులో మార్పు చేయాలని హుకూం జారీ చేశారు. దీంతో చేసేది లేక సదరు మహిళ మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు.. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌గా ఎక్కటి సంజీవరెడ్డి కొనసాగుతున్నాడు. మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి కల్లు తాగేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు అధికారులు, బడా నాయకులు తెలుసని పేర్కొంటూ సదరు మహిళా భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన మహిళ రెండేళ్లక్రితం వారికున్న 20 గుంటల భూమిని విక్రయించగా వచ్చిన రూ.మూడు లక్షలు సంజీవరెడ్డికి ఇచ్చింది. రెండేళ్లయినా ఉద్యోగం కల్పించకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అందరికీ చెబుతానని తీవ్రంగా కొట్టాడు. ఆ సమయంలో అడ్డుగా వచ్చిన ఆమె భర్తపైనా దాడికి పాల్పడ్డాడు. తన మాట వినాలని, లేకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించాడు. ఈ విషయమై స్థానికంగా కొద్దిరోజులుగా పంచాయితీలు కూడా నడుస్తున్నట్లు సమాచారం.

పట్టించుకోని పోలీసులు..  
తనపై, తన భర్తపై దాడి చేశాడని పేర్కొంటూ.. సదరు మహిళా న్యాయం కోసం ఇల్లందకుంట పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కనీసం పట్టించుకోలేదు. సంజీవరెడ్డి పెద్ద హోదాలో ఉన్నాడని, ఆయనపై ఇచ్చిన ఫిర్యాదును మార్పు చేయాలంటూ ఎస్సై నరేశ్‌కుమార్‌ నాలుగు గంటలపాటు ఒత్తిడి తెచ్చారని మహిళ మీడియా ఎదుట వాపోయింది. వివాహేతర సంబంధం కాకుండా భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ కోసం వచ్చినట్లు రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. ఈ విషయమై ఎస్సై నరేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సంజీవరెడ్డి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు.. డబ్బులు కూడా ఇచ్చేది ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చిందని, పూర్తి సమాచారం తెలుసుకునేందుకే కొంత సమయం తీసుకున్నానని, ఫిర్యాదును మార్చాలని తాను మహిళపై ఒత్తిడి తేలేదని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement