సాక్షి, కలసపాడు( వైఎస్సార్ కడప) : ప్రభుత్వ పథకాల తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది. పథకాల్లో ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ లోపం కనిపిస్తోంది. ప్రాథమిక విద్యకు పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకొంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా మారింది. నెలల తరబడి బిల్లులు చెల్లించకుంటే పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. మండలంలో ప్రాథమిక పాఠశాలలు 32, ప్రాథమికోన్నత పాఠశాలలు 6, ఉన్నత పాఠశాలలు 4 ఉన్నాయి. మండలంలో మొత్తం 2089 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చేది అరకొరే..
ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్డు సరఫరా చేసి ప్రాథమిక పాఠశాలలోని ఒక్కో విద్యార్థికి రూ.2.17లు, యూపీ, హైస్కూల్ విద్యార్థులకు రూ.3.24లు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. నిర్వాహకులు కూరగాయలు, వంటగ్యాస్ ఇతర సామగ్రిని కొనుగోలు చేసి పిల్లలకు భోజనం వడ్డిస్తారు. ఒక నెల నుంచి కోడిగుడ్లు, నూనె సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా కందిపప్పు, బియ్యం నాసిరకంగా వస్తుండటంతో పిల్లలు తినే ఆహారంలో నాణ్యత తగ్గుతోంది.
అప్పు చేసి వడ్డించాల్సి వస్తోంది
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాలుగు నెలల బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిలు మండలంలో రూ.4,32,801లు నిర్వాహకులకు రావాల్సి ఉంది. దీంతో పాటు మండలంలో ఉన్న 60 నిర్వాహకులకు నెలకు ప్రభుత్వం గౌరవ వేతనంగా వెయ్యి రూపాయలు ఇస్తుంది. అవి నాలుగు నెలలకు సంబంధించి రూ.2.40 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అప్పు చేసి పిల్లలకు వడ్డించాల్సి వస్తుండటంతో భోజనంలో నాణ్యత కొరవడుతున్న పరిస్థితి దాపురించింది. బిల్లుల మంజూరులో విద్యాశాఖాధికారులు చొరవ తీసుకోవాలని నిర్వాహకులు వేడుకుంటున్నారు.
గుడ్డు కొట్టేశారు
విద్యార్థులకు అందించాల్సిన కోడిగుడ్డుకు ప్రభుత్వం ఎసరు పెట్టింది. గుడ్డు సక్రమంగా చెల్లించకపోవడంతో పాఠశాలలకు సరఫరా ఆగిపోయింది. దాదాపు నెల నుంచి సరఫరా నిలిచిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఏజెన్సీలకు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం, సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోతున్న కారణాలతో తరచూ బ్రేక్ పడుతోంది. పాఠశాల విద్యార్థులకు వారానికి 5 సార్లు గుడ్డు ఇవ్వాలి. ప్రస్తుతం గుడ్డులేని భోజనం విద్యార్థులకు అందించాల్సి వస్తుంది.
వేతనాలు అందక అవస్థలు
నాలుగు నెలల నుంచి వేతనాలు మంజూరు కాలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. అధికారులు స్పందించి వేతనాలు మంజూరు చేయాలి.
– పీరమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, కలసపాడు
ఇంట్లో నుంచి తెచ్చి ఎన్ని రోజులు పెట్టగలం
ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి మధ్యాహ్న భోజనం పెట్టాలంటే ఎలా సాధ్యం. ఒక నెల, రెండు నెలలు అయితే పెట్టగలం. అంతకు మించి పెట్టాలంటే అప్పు చేయాల్సిందే. ప్రభుత్వం ఎప్పుడిస్తుందో తెలియని పరిస్థితుల్లో అప్పు, దానికి వడ్డీ కడితే మాకు మిగిలేది సున్నానే.
– రామలక్షుమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, తెల్లపాడు
Comments
Please login to add a commentAdd a comment