ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఫ్రీజింగ్... ఫ్రీజింగ్.. ప్రస్తుతం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఇదే మారుమోగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఏ రోజు ఏ బిల్లుకు ఫ్రీజింగ్ విధిస్తుందో తెలియడం లేదని సంబంధిత అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. లోటు బడ్జెట్ కారణంగా 22 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్‌ల బిల్లులు తప్ప.. మిగతా ఏ బిల్లులు కూడా పాస్ కావ డం లేదు. చివరికి అత్యవసరమైన ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్,కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మెడికల్ రీయింబర్స్‌మెం ట్ బిల్లులుకు సైతం ఫ్రీజింగ్ కారణంగా మోక్షం కలగడం లేదు. వాహనాలు, భవనాల అద్దె, విద్యార్థుల ఉపకా ర వేతనాలు, కాస్మొటిక్, డైట్ చార్జీలు, మెటీరియల్ సప్లయి బిల్లులదీ అదే పరిస్థితి. దీంతో బాధిత ఉద్యోగులు ట్రెజరీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బిల్లులు కూడా నిలిచిపోయాయి. సంక్రాంతి పండగ వేళ వేతనాలు అందక క్షోభకు గురవుతున్నారు. తమకెందు కు వేతనాలు మంజూరు కావడం లేదని ట్రెజ రీ కార్యాలయానికి వెళితే ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందని, తమ చేతిలో ఏమీలేదని ట్రెజరీ అధికారులు, ఉద్యోగులు చెప్తున్నారు. గ్రీన్ చానల్ కిందికి తెచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ బిల్లులను కూడా నిలిపేయడంతో లబ్ధిదారులకు డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. దీంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
తరచూ నిలిపివేత..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు కారణంగా ట్రెజరీల్లో బిల్లులు పాస్ చేయకుండా తరచూ ఫ్రీజింగ్ విధిస్తూ వస్తోంది. 2016 అక్టోబర్‌లో ఫ్రీజింగ్‌ను ప్రారంభించిన సర్కారు మధ్యమధ్యలో ఒకటి రెండురోజులు మాత్రమే ఎత్తివేసి మరుసటి రోజు మళ్లీ ఫ్రీజింగ్‌ను విధిస్తోంది. రెండు సంవత్సరాల కాలంలో నాలుగైదు రకాల బిల్లులకు తప్ప మిగతా వాటికి ఫ్రీజింగ్‌ను కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం మళ్లీ 2017 డిసెంబర్ 20న ఫ్రీజింగ్ విధించిన ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల బిల్లులను మినహాయించి మిగతా వాటికి ఫ్రీజింగ్ విధించడంపై ఆయా శాఖల ఉద్యోగులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం ఏ రోజు ఏ బిల్లుకు ఫ్రీజింగ్ విధిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రెజరీ ఉద్యోగులకు కూడా ఇబ్బందిగా మారింది. అప్పుడప్పుడు ఒక రోజు మాత్రమే మరికొన్ని బిల్లులకు అనుమతి ఇవ్వడంతో అందరి బిల్లులు పాస్ చేయడం ఉద్యోగులకు కష్టంగా మారింది.
అన్ని బిల్లులు పాస్ కావడం లేదు...
కొన్ని రోజులుగా ప్రభుత్వం నాలుగైదు మినహా అన్ని బిల్లులపై ఫ్రీజింగ్ విధిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్‌ల బిల్లులకు మాత్రమే అనుమతి ఉంది. మిగతా బిల్లులు పాస్ కావడం లేదు. ఆర్థిక శాఖ ఫ్రీజింగ్ ఎత్తివేస్తే అత్యవసర బిల్లులను పాస్ చేయవచ్చు.
– పి.రామ్మోహన్ నాయుడు, డీడీ, ట్రెజరీ శాఖ
Comments
Please login to add a commentAdd a comment