ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు (ఫైల్)
సింధూష ఏయూలో ఇంజినీరింగ్ ఈసీఈ కోర్సు పూర్తి చేసింది. ఈనెల 18న జరిగే గేట్ కౌన్సెలింగ్‌కు సిద్ధమయింది. కౌన్సెలింగ్ సమయంలో డిగ్రీ టీసీ అవసరమని చెప్పడంతో కాలేజీకి వెళ్లింది. కాలేజీ రికార్డులు తిరగేసి రూ.35 వేలు ఫీజు బకాయి చెల్లించి తీసుకెళ్లమని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంది కదా? అని చెప్పినా వినిపించుకోలేదు. ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు అప్పు కోసం తిరుగుతున్నారు.
రాజేష్‌కుమార్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదివాడు. ఎంసీఏలో చేరేందుకు ఐసెట్ రాసి అర్హత సాధించాడు. మంగళవారం నాటి కౌన్సెలింగ్‌కు టీసీతో హాజరు కావాలని చెప్పడంతో కాలేజీకెళ్లాడు. అక్కడ ఫీజు బకాయి సొమ్ము రూ.30 వేలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని చెప్పడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జమ చేసుకోమని చెప్పాడు. వారు నిరాకరించడంతో రాజేష్ తల్లిదండ్రులు బకాయి చెల్లించి టీసీ తెచ్చుకున్నారు. ఇలా సింధూష, రాజేష్‌కుమార్‌లే కాదు.. ఇప్పుడు జిల్లా, నగరవ్యాప్తంగా ఉన్న ఎందరో విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది...!
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ నిర్లక్ష్యం పేద విద్యార్థుల పాలిట శాపంలా మారింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము చెల్లించకపోవడం వల్ల వీరి భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి దాపురించింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లడానికి వివిధ సెట్‌ల కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరమవుతాయి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము ఆయా కళాశాలలకు ఇంకా విడుదల చేయలేదు. దీంతో విద్యార్థుల పేరిట కళాశాల యాజమాన్యాలు బకాయిలు చూపుతున్నాయి. వీటిలో ప్రైవేటు కాలేజీలతో పాటు ప్రభుత్వ కళాశాలలు కూడా ఉన్నాయి. బకాయి పూర్తిగా చెల్లిస్తేనే గాని టీసీ తదితర సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని వీటి యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. సోమవారం నుంచి ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలకు, ఈ నెల 18 నుంచి గేట్‌కు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో రూ.35 వేల ఫీజు బకాయి చెల్లించలేక, ఉన్నత విద్యను వదులుకోలేక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంత మొత్తాన్ని ఇప్పటికిప్పుడు చెల్లించడం పేద, మధ్యతరగతి వారికి తలకుమించిన భారంగా పరిణమిస్తోంది. ఇలా ఫీజుల బకాయిలు చెల్లించనిదే టీసీలివ్వడానికి నిరాకరిస్తున్న కళాశాలల్లో ప్రైవేటుతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కాలేజీ కూడా ఉండడం విశేషం. పోనీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము విడుదల చేసేదాకా బాండ్లపై సంతకాలు చేసయినా ఇవ్వడానికి మరికొందరు విద్యార్థులు సిద్ధమవుతున్నా అంగీకరించడం లేదు. మరికొన్ని కాలేజీల వారు టీసీలకు బదులు బోనఫైడ్ (వారి కాలేజీలో చదివినట్టు) సర్టిఫికెట్లు ఇస్తున్నా వాటిని కౌన్సెలింగ్‌లో అనుమతించడం లేదు.
సర్కారుపై నమ్మకం లేకే..?
ఇంతలా కళాశాలలు బకాయిల కోసం పట్టుబట్టడానికి కారణం ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము వస్తుందో? రాదోనన్న భయమేనని కళాశాలల యాజమాన్యాలు అంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపులు సకాలంలో జరగడం లేదు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నందు వల్ల బాకీలు చెల్లించే వారికే సర్టిఫికెట్లు ఇస్తున్నామని చెబుతున్నాయి.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును కాలేజీలకు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల టీసీలు ఇవ్వడం లేదు. దీంతో కౌన్సెలింగ్ నాటికి అవి అందవన్న భయంతో పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం టీసీతో పనిలేకుండా కౌన్సెలింగ్ నిబంధనలను సడలించాలి. లేదా బోనఫైడ్ సర్టిఫికెట్‌నైనా అనుమతించేలా ఉత్తర్వులివ్వాలి.
– కె.ఆదినారాయణ, విద్యార్థిని తండ్రి, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా
నిబంధనల ప్రకారమే ఇవ్వడం లేదు..
స్టూడెంట్ ఫీజు బకాయి ఉంటే సర్టిఫికెట్లు ఇవ్వరాదన్న నిబంధన ఉంది. దానినే మేం అమలు చేస్తున్నాం. బకాయి చెల్లించకుండా సర్టిఫికెట్లు తీసుకుపోతే ఆ తర్వాత వారి చుట్టూ మేం తిరగలేం. వారు చెల్లించకపోతే ఎవరు బాధ్యులవుతారు? అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చాక వారికి తిరిగి ఇచ్చేస్తామని, ముందుగా ఫీజు బకాయి చెల్లించాలని చెబుతున్నాం.
– ప్రమీలాదేవి, ప్రిన్సిపాల్, ఏయూ మహిళా కళాశాల
Comments
Please login to add a commentAdd a comment