సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర కోసం రాజ్‌భవన్‌లో ఐదు బిల్లులు ఎదురుచూస్తున్నాయి. గవర్నర్ కరుణ కోసం ప్రభుత్వ పెద్దలు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 2011 నుంచి 2021 వరకు రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఉప్పు, నిప్పులా సాగే ఈ రెండు పార్టీలు ఒకరి తరువాత మరొకరు అధికారంలోకి వచ్చినపుడు గత ప్రభుత్వం చేసిన చట్టాలను, పథకాలను సవరించడం లేదా ఎత్తివేయడం రాష్ట్రంలో పరిపాటి.
ఇదే కోవలో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం అదేపనికి పూనుకుంది. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలనే డిమాండ్ మినహా గత ప్రభుత్వ విధానాలను దాదాపుగా అన్నింటినీ పునఃపరిశీలిస్తోంది. అసెంబ్లీలో ముసాయిదాలు ప్రవేశపెట్టడం, అధికార, ప్రతిపక్ష సభ్యులు కలిసి చర్చలు జరపడం, తరువాత గవర్నర్ ఆమోదానికి పంపడం రాజ్యాంగపరమైన ఆనవాయితీ. గవర్నర్ అంగీకారం తెలిపితేగాని బిల్లులు, పథకాలు అమల్లోకి రావు. డీఎంకే ప్రభుత్వం పలు ముసాయిదాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని రాజ్‌భవన్‌కు పంపింది. వీటిల్లో రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని రాజ్‌భవన్ ఢిల్లీకి పంపింది.
పెండింగ్‌లో ఐదు బిల్లులు
ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు రాజ్‌భవన్ పెండింగ్‌లో పెట్టేసింది. రిజిస్ట్రేషన్ చట్టం–2021లో మూడు సవరణలను తీసుకొస్తూ గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన అసెంబ్లీలో ముసాయిదా ఆమోదించి గవర్నర్‌కు పంపారు. భారతియార్ యూనివర్సిటీ సవరణ ముసాయిదాను గత ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన అసెంబ్లీ ఆమోదించింది. సహకార సంఘాల చట్టంలో రెండో సవరణను ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఆమోదించారు.
‘నీట్’ ముసాయిదా ప్రత్యేకం
అన్నిటికంటే వైద్య విద్యలో ప్రవేశానికి కేంద్రం ప్రవేశపెట్టిన నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలనే డిమాండ్‌పై అసెంబ్లీలో జరిగిన ఏకగ్రీవ తీర్మానం అత్యంత ప్రధానమైంది. గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఒకసారి తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం సైతం గత ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. అయితే ఆ తరువాత వచ్చిన కొత్త గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకుండా వెనక్కుపంపారు. మరిన్ని సవరణలతో మరోతీర్మానం చేసి పంపాలని ఆదేశించారు.
ఈ చర్య రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది. ఆ తరువాత గతనెల 9వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మరోసారి అదే తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అయినా ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపలేదు. దీంతో సీఎం స్టాలి న్ ఇటీవల గవర్నర్‌ను కలిసి నీట్ తీర్మానం ఆమోదం గురించి వత్తిడిచేశారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన నాలుగింటి మాటెలా ఉన్నా నీట్ బిల్లుపై మాత్రం ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాజ్యాంగం ప్రకారం రెండోసారి వెనక్కుపంపే అధికారం గవర్నర్‌కు లేదు, రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లకతప్పదు కాబట్టి నీట్ మినహాయింపు ఖాయమనే ధీమాతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment