మాటలే.. చేతల్లేవ్!
– పేరుకుపోయిన అంగన్‌వాడీ అద్దె బకాయిలు
– జిల్లా వ్యాప్తంగా రూ.2 కోట్లకు పైగా పెండింగ్
– ధర్మవరంలో రెండేళ్లుగా విడుదల కాని వైనం
– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలోనే ఇదీ దుస్థితి
– ఆర్థిక ఇబ్బందుల్లో అంగన్‌వాడీ సిబ్బంది
- ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 298 మెయిన్, 62 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2015 సెప్టెంబర్ నుంచి కేంద్రాలకు అద్దె బకాయిలు విడుదల కాలేదు. ఇప్పటివరకు ఏకంగా రూ.90 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.
- హిందూపురం ప్రాజెక్ట్ పరిధిలో 464 మెయిన్, 86 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. గత ఏడాది జూలై నుంచి అద్దె బకాయిలు రూ.30 లక్షల వరకు రావాల్సి ఉంది.
ఈ రెండు ప్రాజెక్టులే కాదు.. జిల్లా వ్యాప్తంగా అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె బకాయిలు రూ.2 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. దీంతో సెంటర్లు నిర్వహించాలంటే కార్యకర్తలకు తలకుమించిన భారంగా మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొంది. బకాయిల సమస్య మంత్రి దృష్టికి వెళ్లినా కేవలం మాటలతోనే గారడీ చేస్తున్నారు.
అనంతపురం టౌన్ : పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను నేర్పాలన్న లక్ష్యంతో ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నెలల తరబడి కేంద్రాలకు అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద జిల్లాలో 17 ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 5,126 మెయిన్, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో మూడు వేలకు పైగా కేంద్రాలను అద్దె గదుల్లో నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ.750, పట్టణ ప్రాంతాల్లోని వాటికి రూ.3 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుంటే నెలవారీగా క్రమం తప్పకుండా చెల్లించాలి. సకాలంలో ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాలని యజమానులు హుకుం జారీ చేస్తారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
జిల్లావ్యాప్తంగా రూ.2 కోట్లకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అంగన్‌వాడీల జీవితం దయనీయంగా మారిపోతోంది. సకాలంలో రాని అద్దె బకాయిలతో అప్పులు చేయాల్సిన దుస్థితి. ఇలా అయితే అద్దె భవనాల్లో కేంద్రాలు నిర్వహించడం కష్టమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిల విషయమై మంత్రి పరిటాల సునీతకు అంగన్‌వాడీ కార్యకర్తలు విన్నవించినా ఫలితం మాత్రం శూన్యం. అదిగో..ఇదిగో అంటూ ఊరిస్తున్నారే తప్పా సమస్యలు మాత్రం తీరడం లేదు.
ప్రాజెక్టుల వారీగా అద్దె బకాయిల వివరాలు (2017 మే నాటికి..)
ఐసీడీఎస్ ప్రాజెక్టు రావాల్సిన అద్దె
అనంతపురం అర్బన్ రూ.6,37,800
చెన్నేకొత్తపల్లి రూ.82,400
ధర్మవరం రూ.89,57,600
గుత్తి రూ.7,63,000
హిందూపురం రూ.29,54,963
కదిరి ఈస్ట్ రూ.100000
కదిరి వెస్ట్ రూ.26,30,000
కళ్యాణదుర్గం రూ.1,44,000
కణేకల్లు రూ.1,45,305
కూడేరు రూ.2,20,000
మడకశిర రూ.2,58,100
పెనుకొండ రూ.8,20,000
రాయదుర్గం రూ.1,85,000
శింగనమల రూ.85,800
తాడిపత్రి రూ.18,05,000
ఉరవకొండ రూ.1,05,000
కంబదూరు రూ.1,60,000
మొత్తం రూ.2,00,53,968
మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
అంగన్‌వాడీ సెంటర్లకు బకాయిలున్న మాట వాస్తవమే. ప్రాజెక్టుల వారీగా ఎంత బకాయి ఉందన్న వివరాలను మంత్రి సునీతతో పాటు కమిషనర్‌కు అందజేశాం. త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
– ఉషాఫణికర్, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ
మంత్రికి చెప్పినా స్పందన లేదు
అద్దె బకాయిల విషయాన్ని నెల క్రితమే మంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. సెంటర్లు నడపాలంటే కష్టంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే వారే లేరు. అతికష్టమ్మీద నెట్టుకొస్తున్నాం.
– వనజ, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి