సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే సూర్యనారాయణ, అంగన్‌వాడీ నాయకురాళ్లు
ధర్మవరం: ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచింది. దీంతో అంగన్‌వాడీ సిబ్బంది ఎమ్మెల్యే సూర్యనారాయణను ఘనంగా సన్మానించడం విమర్శలకు తావిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నాలుగు రోజుల క్రితమే ధర్మవరం సీడీపీవో పద్మావతి సస్పెండ్ అయ్యారు. అయినా ఐసీడీఎస్‌లో అవినీతి చెదలు పేట్రేగిపోతోంది. ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.10,500, ఆయాలకు రూ.6,000 వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అంగన్‌వాడీలకు వేతనాలు పెంచారని, ధర్మవరం ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీలంతా ఎమ్మెల్యే సూర్యనారాయణను సన్మానించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా ధర్మవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి భార్య అయిన అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీల సంఘం నాయకురాలు రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేకు సన్మానం చేయాలంటే ఖర్చు అవుతుంది. అందుకే ఒక్కో అంగన్‌వాడీ టీచర్ రూ.100, ఆయాలు రూ.50 చొప్పున డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఎమ్మెల్యేకు చెబుతామంటూ బెదిరింపులకూ దిగింది. చేసేదిలేక ఒక్కో అంగన్‌వాడీ టీచర్ రూ.100, ఆయాలు రూ.50 చొప్పున డబ్బులను సదరు నాయకురాలికి అందజేశారు.
ఇంకా కొందరు ఆలస్యంగా ఇస్తామని చెప్పా రు. ధర్మవరం ఐసీడీఎస్ పరిధిలోని ధర్మవరం పట్టణం, రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో దాదాపు అంగన్‌వాడీ టీచర్లు 354 మంది, ఆయాలు 350 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరితో రూ.100, రూ.50 చొప్పున వసూలు చేయగా రూ.52,900 నగదు వసూలైంది. కానీ శనివారం ధర్మవరం మార్కెట్‌యార్డులో ఎమ్మెల్యే సూర్యనారాయణ సమక్షంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేను పూలమాలలు, నాలుగు శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణకు సన్మానం చేసేందుకు, కేక్, కుర్చీలు, బ్యానర్ తదితర వాటికి అంతా కలిపి రూ.5 వేలు కూడా కాకపోవడం గమనార్హం. సమావేశంలో అంగన్‌వాడీలందరికీ భోజన ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే ఖర్చులతోనే చేయించారు. కానీ అంగన్‌వాడీ కార్యకర్తలతో రూ.100, ఆయాలతో రూ.50 చొప్పున ముక్కుపిండి వసూలు చేశారు. ఇదేమని అడిగేవారు లేకపోవడంతోపాటు ప్రస్తుతం సీడీపీవో సస్పెండ్‌కు గురికావడంతో అంగన్‌వాడీల సంఘం నాయకురాలిది ఇష్టారాజ్యమైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment