తిప్పక్క (ఫైల్)
రాయదుర్గం: డ్యూటీ టెన్షన్ తట్టుకోలేక అనారోగ్యానికి గురైన అంగన్‌వాడీ టీచర్ చివరకు ప్రాణం కోల్పోయింది. తనిఖీల పేరుతో సీడీపీఓ చేసిన హడావుడి, వేధింపులే మృతికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త నాగరాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం రాతిబావి వంక గ్రామానికి చెందిన హరిజన తిప్పక్క (32) గ్రామదట్ల ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తోంది. జూలై 18న సీడీపీఓ రాధిక గ్రామదట్ల ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ‘రికార్డులను చూస్తే కడుపు మండిపోతోంది.
నిన్ను ఏమి చేసినా కోపం తీరదు. కొడితే బుద్ధి వస్తుంది’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్త తిప్పక్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడీపీఓ మాటలకు కార్యకర్త భయంతో వణికిపోయింది. అంగన్‌వాడీ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ చేయడం కోసం సర్వర్ సమస్య వల్ల అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిద్ర మేల్కొనేది. రికార్డుల నిర్వహణకు సంబంధించి రాత్రి పది, పదకొండు గంటల సమయాల్లో కూడా సీడీపీఓ వాయిస్ మెయిల్ ఫోన్‌కు వచ్చేది. మానసిక ఆందోళనతో ఇబ్బందిపడుతున్న తిప్పక్కను భర్త నాగరాజు బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె టెన్షన్‌తో ఇబ్బంది పడుతోందని వైద్యులు తేల్చారు.
మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఆ మేరకు బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగి గుండెపోటుకు గురవడంతో శుక్రవారం సాయంత్రం తిప్పక్క మృతి చెందింది. రికార్డుల నిర్వహణ పేరుతో ఐసీడీఎస్ అధికారులు పెట్టిన టెన్షన్ల వల్లే తిప్పక్క మృతి చెందిందని భర్త నాగరాజు, తండ్రి సిద్దప్ప ఆరోపించారు. అధికారిపై పీడీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై సీడీపీఓ రాధికను ఫోన్‌లో వివరణ కోరగా.. అంగన్‌వాడీ కార్యకర్త మృతి బాధాకరమన్నారు. అయితే తన టార్చర్ వల్ల మృతి చెందిందనడం అవాస్తవమన్నారు. అనారోగ్యం వల్ల ఆమె మృతి చెందిందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment