ఆస్పత్రిలో అంగన్‌వాడీ కార్యకర్తను పరామర్శిస్తున్న బోయ గిరిజమ్మ
అనంతపురం న్యూసిటీ: స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ మహిళాధ్యక్షురాలు బోయ గిరిజమ్మ విమర్శించారు. కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తపై శనివారం జరిగిన దాడిని ఆమె ఖండించారు. అనంత సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె ఆదివారం కలిసి పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో దౌర్జన్యాలు, అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. పట్టపగలే అంగన్‌వాడీ కార్యకర్తపై అత్యాచారయత్నానికి తెగబడడం సిగ్గు చేటన్నారు. ఘటనకు కారకుడైన టీడీపీ కార్యకర్తపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేకూరేవరకూ వైఎస్సార్ సీపీ తరుఫున పోరాటం సాగిస్తామని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు లక్ష్మి, పద్మ, రత్న, మణి, రామాంజినమ్మ, తదితరులున్నారు.
కామాంధుడిపై చర్యలకు ఐద్వా డిమాండ్
అనంతపురం న్యూసిటీ: కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఎస్పీకు ఆమె వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. గ్రామాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై బలమైన సెక్షన్లు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీని కలిసిన వారిలో ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక, నాయకురాలు వనజ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్రయాదవ్ తదితరులున్నారు. అంతకు ముందు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను వారు పరామర్శించి, జరిగిన ఘటనపై ఆరా తీశారు.
ఎస్సీని కలిసిన సీఐటీయూ నేతలు
అనంతపురం రూరల్: కనగానపల్లి మండలం తూంచర్ల అంగన్‌వాడీ కార్యకర్తపై లైంగిక దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్త నాగరాజుపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఎస్పీని వారు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తపై లైంగిక దాడికి ప్రయత్నించిన నాగరాజుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గోపాల్, కదిరప్ప, అంగన్‌వాడీ హెల్పర్ యూనియన్ నాయకురాళ్లు జమునా, దిల్షాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment