కమీషన్‌ లొల్లి.. కాలం చెల్లి | Expired Milk Distribution In Anantapur Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ పాపాలు

Published Thu, Jul 12 2018 11:21 AM | Last Updated on Thu, Jul 12 2018 11:21 AM

Expired Milk Distribution In Anantapur Anganwadi - Sakshi

అంగన్‌వాడీలు.. అక్రమార్కుల పాలిటకల్పతరువులవుతున్నాయి. పర్యవేక్షణ     కరువై.. ప్రశ్నించేవారు లేకపోవడంతో     ఎవరికి వారు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇన్నాళ్లూ కుళ్లిపోయిన కోడిగుడ్లు సరఫరా చేసి జేబులు నింపుకున్న అక్రమార్కులు.. ఇపుడు ఏకంగా గడువు ముగిసిన పాలను సరఫరా చేసి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కాసులకోసం కాలకూటాన్ని బలవంతంగా తాగిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ఈ పా‘పాలు’ వెలుగు చూస్తుండటం గమనార్హం.

అనంతపురం సెంట్రల్‌:  చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించి వారిలో రక్తహీనత, బుద్ధిమాంద్యం నివారించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పాలు, కోడిగుడ్డుతో పాటు మధ్యాహ్న భోజనం.. చిన్నారులకు ప్రత్యేకంగా బాలామృతం అందజేస్తోంది. కానీ పౌష్టికాహారం ముసుగులో కొందరు అధికారులు చేతివాటంప్రదర్శిస్తున్నారు. కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యతలేని సరుకులతో తయారు చేసి భోజనం అందిస్తూ జేబులు నింపుకున్నారు. అది చాలదన్నట్లు తాజాగా కాలం చెల్లిన పాలప్యాకెట్లు సరఫరా చేస్తూ పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.  ఎవరైనా పాలను ఏ రోజుకారోజు తీసుకుంటారు. కానీ ఐసీడీఎస్‌ అధికారులు మాత్రం రెండు నెలలకోటాను ఒకేసారి తీసుకకుని భద్రపరిచేందుకు అనువైన పరికరాలు అంగన్‌వాడీ సెంటర్‌లలో లేకపోయినప్పటికీ అట్టపెట్టెలలో పంపిణీ చేస్తున్నారు. 

పేరుకే ఏపీ డెయిరీ...
కర్ణాటకలోని తుమకూరు ప్రాంతం నుంచి జిల్లాకు పాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకొని లీటరుకు రూ. 42 చొప్పున ఏపీ డెయిరీ సంస్థ సరఫరా చేస్తోంది. జిల్లాకు 2.50 లక్షల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్లు వరకూ సరఫరా చేస్తున్నట్లు ఏపీడెయిరీ అధికారులు తెలిపారు. అయితే పేరుకు ఏపీ డెయిరీ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ... సరఫరా వెనుక ఓ మంత్రి ఉన్నట్లు  తెలుస్తోంది. జిల్లాలో  ఒకప్పుడు లక్ష లీటర్లు సేకరిస్తున్న ఏపీడెయిరీ సంస్థ ప్రస్తుతం 5 వేల లీటర్లు కూడా సేకరణ గగనమవుతోంది. ప్రస్తుతం లాకౌట్‌ దిశగా సాగుతోంది. అదే సంస్థ ఇతర రాష్ట్రాల నుంచి పాలను తెప్పించడం వెనుక మతలబు ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతోంది. 

అంతటా కమీషన్ల పర్వం
మహిళా, శిశు సంక్షేమశాఖలో మొత్తం కమీషన్ల పర్వం కొనసాగుతోందన్న విమర్శలున్నాయి. నాసిరకం కోడిగుడ్లు సరఫరా అయినా, కాలం చెల్లిన ప్యాకెట్లు వచ్చినా... ప్రజలకు అంటగట్టడమే పరమావధిగా కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలం గడువుమీరిన ప్యాకెట్లు వెలుగుచూశాయి. కేవలం చెన్నేకొత్తపల్లి ప్రాజెక్టు మాత్రమే కాకుండా అన్ని ప్రాజెక్టులకూ సరఫరా అయినట్లు తెలుస్తోంది. తాజాగా నగరంలోని రుద్రంపేటలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో గడువుమీరిన పాలప్యాకెట్లు అందజేశారు.   రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే అంగన్‌వాడీ సెంటర్‌లలో ఇలాంటి దారు ణాలు జరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.   

గోదాములోనే పొరపాటు  
అనంతపురం జిల్లాలో గడువు తీరిన పాలప్యాకెట్లు సరఫరా అయిన విషయం నా దృష్టికీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల లీటర్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో దాదాపు 3 లక్షల లీటర్ల వరకూ సరఫరా చేస్తున్నాం. పాల తయారీ కేంద్రంలో ఎలాంటి తప్పు దొర్లలేదు. అక్కడ తయారైన ప్యాకెట్లను గోదాములకు పంపి.. అక్కడ నుంచి జిల్లాలకు పంపిణీ చేస్తాం. అయితే ఇక్కడ సరిగా చూసుకోకపోవడంతో 500 లీటర్ల వరకూ గడువుమీరిన ప్యాకెట్లు వచ్చినట్లు తేలింది. మిగతా చోట్ల ఎక్కడా ఇబ్బంది లేదు.  – రామకోటేశ్వరరావు, రాష్ట్ర మేనేజర్, ఏపీ డెయిరీ మార్కెటింగ్‌ విభాగం

విచారణ చేయిస్తున్నాం
చెన్నేకొత్తపల్లి ప్రాజెక్టులో మాత్రమే గడువుమీరిన పాలప్యాకెట్లు వచ్చినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేయిస్తున్నాం. మిగిలిన ప్రాజెక్టుల్లో కూడా విచారణ చేయిస్తున్నాం. ఇప్పటి వరకూ ఎక్కడా తేలలేదు. గడువుమీరిన ప్యాకెట్లు సరఫరా చేసిన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయి. త్వరలో కమిషనర్‌కు నివేదిక ఇస్తాం.– ప్రశాంతి, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement