‘‘ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత కూడా ఇష్టానుసారం అప్పు చేయించి తన వాళ్లకు చంద్రబాబు బిల్లులు చెల్లింపజేశారు. మిగిలిన అస్మదీయుల బిల్లులూ క్లియర్ చేసేందుకు నిబంధనలను కాలరాసి ఇంకా అప్పులు చేయిస్తున్నారు. దీని కోసం ఆర్థిక శాఖపై గట్టి ఒత్తిడి వచ్చింది. పోలింగ్ పూర్తయి అధికారం కోల్పోతున్నామని తెలిసిన తరువాత కూడా ఆఖరి ప్రయత్నంగా కేబినెట్ సమావేశం పేరుతో అనుకున్న పనులు సాధించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందుకోసం వచ్చే మంగళవారం చేయాల్సిన అప్పును కూడా ఈ మంగళవారమే చేయించేస్తున్నారు’’
సాక్షి, అమరావతి: కరవు, తుఫాను సహాయం, మంచినీటి సరఫరా, ఉపాధి హామీ కార్యక్రమాల సమీక్ష సాకుతో మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఆ 4 అంశాలతో కేబినెట్ నిర్వహణకు అనుమతించాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. మంగళవారం కేబినెట్ నిర్వహణకు కమిషన్ అనుమతిస్తుందని భావించిన చంద్రబాబు ఆ ముసుగులో అస్మదీయులైన కాంట్రాక్టర్లకు, పార్టీ నేతలకు చెందిన బిల్లులు చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించాలని చంద్రబాబు నిర్ణయించారు.
అప్పుల కోసం తిప్పలు...
ముందుచూపుగానే 14వ తేదీ మంగళవారం నాటికి రూ.2,000 కోట్లు సమకూర్చుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ కార్యదర్శులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ కార్యదర్శులు 14వ తేదీ మంగళవారం ఓపెన్ మార్కెట్‌లో రూ.1,000 కోట్లు అప్పు చేయాలని నిర్ణయించారు. అయితే ఆర్‌బీఐ విధించిన షరతు ప్రకారం వారానికి రూ.500 కోట్లు మాత్రమే రుణంగా తీసుకోవాల్సి ఉంది. అయితే వచ్చే మంగళవారం 21వ తేదీన 500 కోట్ల రూపాయలు అప్పు చేయబోమని, అప్పుడు చేయాల్సిన 500 కోట్ల రూపాయల అప్పును కూడా ఈ మంగళవారమే అంటే 14వ తేదీనే చేస్తామని, అందువల్ల మంగళవారం రూ.1,000 కోట్ల రుణ సేకరణకు అనుమతించాల్సిందిగా ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆర్‌బీఐని కోరారు. దీంతో ఆర్‌బీఐ 14వ తేదీన ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.1,000 కోట్లు అప్పు చేసేందుకు అనుమతించింది. 14వ తేదీ ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 1,000 కోట్ల అప్పు సమీకరించనున్నారు. 15వ తేదీన రాష్ట్ర ఖజానాకు జమకానున్నాయి.
రూ.32 వేల కోట్ల అప్పునకు బ్రేక్...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం మేర ఓపెన్ మార్కెట్ ద్వారా 32 వేల కోట్ల రూపాయల అప్పునకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖ వినతిని సమ్మతించలేదు. ఎందుకంటే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి అదనంగా ఆరు వేల కోట్ల రూపాయల అప్పు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిర్ధారించిన మేరకే అప్పులు చేయాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏడాది ఎక్కువ చేసిన అప్పును కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన అప్పును నిర్ధారిస్తుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు పరిమాణం తగ్గిపోనుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.8,000 కోట్ల రుణసేకరణకే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఇంకా ఎంత రుణానికి అనుమతించాలనేది లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకున్న తరువాత చెబుతామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఓట్లు రాబట్టుకునేందుకు రూ. 5వేల కోట్ల అప్పు...
చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నెల ఏప్రిల్ 9వ తేదీన అంటే పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏకంగా ఒకేసారి రూ.5,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఈ విధంగా చేసిన అప్పుల మొత్తాన్ని ఎన్నికల ముందు ఓట్లు రాబట్టే పథకాల కోసం వినియోగించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఏ శాఖకు చెందిన అధికారులైనా నూట్రల్‌గా ఉంటారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శులు మాత్రం ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేశారు. పార్టీకి చెందిన నేతలుగా వ్యవహరిస్తూ సీఎం చెప్పిన బిల్లులను చెల్లించేశారు. పసుపు– కుంకుమ పేరుతో అప్పు చేసిన నిధులను తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రయోజనాల కోసం విడుదల చేశారు.
ఇదిలా ఉండగా ఒకేసారి 5,000 కోట్ల రూపాయల అప్పు చేయడంతో ఏప్రిల్ నెలలో అనుమతించబోమని ఆర్‌బీఐ స్పష్టం చేస్తూ వారానికి రూ.500 కోట్లే ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేయాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో 2వ తేదీ రూ.500 కోట్లు, అలాగే 7 వతేదీ మరో 500 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పుడు ఈ నెల 21వ తేదీ చేయాల్సిన అప్పును కూడా కలుపుకుని ఈ నెల 14వ తేదీన రూ.1,000 కోట్లు అప్పు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అంటే కేంద్రం తొలి త్రైమాసికానికి అనుమతించిన 8,000 కోట్ల రూపాయల రుణంలో మంగళవారం చేసే రూ.1,000 కోట్లతో కలిపితే రూ.7,000 కోట్లు అప్పు చేసినట్లవుతుంది. ఇక వచ్చే నెలలో కేవలం 1,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి మాత్రమే అనుమతి మిగిలింది. అంటే ఓట్ల లెక్కింపు అనంతరం వచ్చే ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తప్పని పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం కల్పించినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment