సాక్షి,సిటీబ్యూరో: అవన్నీ పేరుకు బహుళ అంతస్తుల భవనాలు. అందులో ఉండేవారు టిప్‌టాప్‌గా తిరిగే బడా బాబులే.. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంలో ముందున్నారు. నిత్యావసరమైన జలమండలి నీటిని విచ్చలవి డిగా వాడేసుకుని.. రూ.లక్షల్లో వచ్చిన బిల్లులు చెల్లించమంటే ముఖం చాటేస్తున్నారు. నగదు చెల్లించమని పలు పర్యాయాలు జలమండలి హెచ్చరించినా.. వారిలో చలనం రాకపోయేసరికి అధికారులు ఆయా భవంతులకు నల్లా కనెక్షన్ తొలగించారు. దీంతో ఆ భవనాలు ‘డిస్‌కనెక్షన్’ జాబితాలో చేరాయి. కానీ వాటికి యథావిధిగా నల్లా నీరు సరఫరా జరిగిపోతోంది. గ్రేటర్ పరిధిలో ఇలాంటి అక్రమ నల్లాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల జలమండలి విజిలెన్స్ విభాగం కొరడా ఝుళిపించడంతో 18 బహుళ అంతస్తుల భవంతులకున్న అక్రమ నల్లాల బాగోతం బయటపడింది. వీరంతా శ్రీమంతులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా బిల్లుచెల్లించని కారణంగా ‘డిస్‌కనెక్షన్’ అయిన నల్లాల జాబితాను బోర్డు విజిలెన్స్ బృందం సేకరించింది. ఒక్కో భవంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్రమ నల్లాల డొంక కదులుతుండడం గమనార్హం.
అక్రమాలతో బోర్డు ఆదాయానికి గండి
జలమండలి పరిధి విస్తరించడంతో ప్రస్తుతం నల్లా కనెక్షన్ల సంఖ్య 9.65 లక్షలకు చేరింది. ఇందులో వాణిజ్య కేటగిరి కింద వచ్చే నల్లా కనెక్షన్లు కేవలం 40 వేలకు మించి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు నెలవారీగా బోర్డు ఆదాయం రూ.95 కోట్లు కాగా.. విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు కలిసి నెలవారీ వ్యయం రూ.115 కోట్లుగా ఉంది. ఈ అక్రమ నల్లాలే జలమండలిని ‘రూకల్లోతు’ ఆర్థిక కష్టాల్లోకి నెట్టినట్టు తేలింది. ఇటీవలి కాలంలో రూ.లక్షల్లో పెండింగ్ బిల్లులు పేరుకుపోయిన పలు బహుళ అంతస్తుల భవంతులకు నల్లా కనెక్షన్లను బోర్డు తొలగించినప్పటికీ.. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో యథావిధిగా నల్లా కనెక్షన్లను పునరుద్ధరించుకొన్న బడాబాబుల బాగోతం విస్తుగొలుపుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా డిస్‌కనెక్షన్ అయిన సుమారు వెయ్యి నల్లా కనెక్షన్ల జాబితాను బోర్డు విజిలెన్స్ బృందం తీసుకుని ఆయా భవనాల వారీగా తనిఖీలు చేపట్టగా అధికారులకు జిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి భవనానికి ఎన్నో నెలలుగా అక్రమ నల్లాలు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ ప్రధానంగా మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట్ తదితర శ్రీమంతుల నివాస ప్రాంతాలే కావడం గమనార్హం.
వాణిజ్య కార్యకలాపాలకు ‘ఇంటి’ నీళ్లే..
గ్రేటర్‌లోని పలు భవంతుల్లో హాస్టళ్లు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సేవా రంగానికి సంబంధించిన పలు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అయిప్పటికీ నేటికీ గృహ నిర్మాణ కేటగిరీ(డొమెస్టిక్) కిందనే నల్లా నీరు సరఫరా అవుతోంది. దీంతో ఆయా భవనాల యజమానులు వేలల్లో నీటిబిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. వందల్లోనే చెల్లిస్తుండడం గమనార్హం. ఈ అక్రమాలకు ప్రధానంగా క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలపడమేనని బోర్డు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎండీ సీరియస్.. వెలుగులోకి అక్రమాలు
డిస్‌కనెక్షన్(తొలగించిన) జాబితాలో ఉన్నప్పటికీ నల్లా కనెక్షన్ కొనసాగుతున్న భవనాల ఉదంతం రోజుకొకటి వెలుగు చూస్తుండడంతో జలమండలి ఎండీ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీచేశారు. విజిలెన్స్ సిబ్బందిని రం గంలోకి దించారు. వరుస తనిఖీలు నిర్వహిస్తుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అక్రమ నల్లాలున్న భవన యజమానులపై విజిలెన్స్ బృందాలు సమీప పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 269, 430 సెక్షన్ల కింద కేసులు నమో దు చేస్తున్నాయి. అక్రమార్కులు దారికొచ్చే వరకు తనిఖీలు ముమ్మరం చేయాలని ఎండీ ఆదేశించా రు. బోర్డు డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు విజిలెన్స్ సిబ్బంది అడిగిన సమాచారాన్ని అందజేయాలని ఎండీ ఆదేశించారు. అక్రమ నల్లాల ఏర్పాటుకు సహకరించిన క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేయడంతో అక్రమాల డొంక ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కాగా అక్రమ నల్లాలను కట్టడిచేస్తే బోర్డు రెవెన్యూ ఆదాయం నెలవారీగా రూ.వంద కోట్లకు చేరుకుంటుందని జలమండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్రమ కనెక్షన్ల వినియోగం..క్రిమినల్ కేసులు నమోదు
బంజారాహిల్స్: బోర్డు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్న రెండు సంస్థలపై చర్యలు తీసుకున్నారు. బుధవారం వాటర్ వర్క్స్ జూబ్లీహిల్స్ సెక్షన్ మేనేజర్ సలోమి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో ఎలాంటి అనుమతి లేకుండానే ప్రధాన పైప్‌లైన్ పగలగొట్టి కార్యాలయంలోకి మంచినీటి కనెక్షన్ అక్రమంగా తీసారు. దీంతో ప్రధాన పైప్ నుంచి పెద్ద ఎత్తున మంచినీళ్లు వృథాగా పోతున్నాయి. అయితే కొన్నేళ్లుగా అక్రమంగా తీసుకున్న నల్లా కనెక్షన్‌తో నీళ్లు పొందుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో కార్వీ సంస్థపై ఐపీసీ సెక్షన్ 269, 430 కింద కేసులు నమోదు చేశారు.
విస్పర్ వ్యాలీ క్లబ్‌పైనా చర్యలు
జూబ్లీహిల్స్ మహాప్రస్థానం సమీపంలోని ఫ్లాట్ నంబర్ 35(ఏ)లో కొనసాగుతున్న విస్పర్ వ్యాలీ క్లబ్‌లో అక్రమ మంచినీటి కనెక్షన్లు వినియోగిస్తున్నారు. ఈ సంస్థపైనా జూబ్లీహిల్స్ పోలీసులు క్లబ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రధాన పైప్‌లైన్‌ను పగలగొట్టి అక్రమంగా క్లబ్‌లోకి మంచినీటి కనెక్షన్లను తీసుకున్నారు. ప్రధాన పైప్ నుంచి నీరు వృథా పోతుండగా జలమండలి సిబ్బంది గుర్తించి పరిశీలించగా.. ఈ అక్రమ కనెక్షన్ గుట్టు రట్టయింది. వాటర్‌వర్క్స్ మేనేజర్ సలోమి ఫిర్యాదు మేరకు విస్పర్ వ్యాలీ క్లబ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment