ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఇది వరకు అప్పు చేసి పప్పు కూడు తినేవారేమో. ఇప్పుడు హాస్టల్ కూడు పెట్టడానికి కూడా అప్పు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెనూలు మార్చడం, కాగితాల్లో డైట్ చార్జీలు పెంచడం చేస్తోంది గానీ.. మెనూ అమలు చేయడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వడంలో మాత్రం ఎక్కడలేని పిసినారితనం చూపుతోంది. ఫలితంగా విద్యార్థులకు వండి పెట్టడానికి వసతి గృహ సంక్షేమాధికారులు అప్పులు చేయాల్సి వస్తోంది. డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే జీఓ విడుదల చేసింది. అయితే పెంచిన చార్జీలు వసతి గృహ అధికారులకు అందడం లేదు.
నిధుల విడుదల లేకపోవడంతో కొత్త మెనూ అమలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ప్రధానంగా బీసీ వసతి గృహాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో కొత్త మెనూ అమలు చేయాలంటే అధి కారులకు భారంగా మారుతోంది. ఒక్కో సంక్షేమ వసతి గృహం అధికారికి అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.4 లక్షల నుంచి రూ.6లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. హాస్టళ్లలో సరుకుల కోసం వార్డెన్లు చేసిన అప్పులే ఇవి. ఇంకా ఈ బిల్లులు మంజూరు కాకపోవడంతో కొందరు వార్డెన్లకు అప్పు కూడా దొరకని పరిస్థితి ఉంది.
అధ్యయనం చేసినా..
రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణపై ఓ కమిటీ అధ్యయనం చేసి మహారాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాల్లో అమలు చేస్తున్న డైట్‌ను ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అదే మెనూ అమలు చేయాలని నిర్ణయించారు. అయితే మెనూ మార్చినా అప్పటి కి చార్జీలు పెంచలేదు. పెరుగుతున్న ధరలకు ఈ మెస్ చార్జీలు అస్సలు సరిపోవు. ప్రీ మెట్రిక్ వారి కంటే పోస్టు మెట్రిక్ వారికి మరింత ఇబ్బంది ఉంది.
వారికి పెరిగిన ధరతో పాటు ఒక పూట భోజనం అదనంగా ఉంటుంది. దీంతో వారికి ఇబ్బం దిగా మారుతోంది. ఇటీవల జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా, ఆ పథకం ఇంకా పురిటి దశలో సమస్యల్లోనే ఉంది. జూలై ఒకటి నుంచి నూతన డైట్ విధానం అమలు చేయాలని జీఓ 82ను విడుదల చేసింది. వారంలో మూడు రోజు లు కోడి కూర ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆదేశాలు బాగానే ఉన్నా వసతి గృహాలకు, డైట్, కాస్మొటిక్ చార్జీలు చెల్లించలేదు.
రూ.5.2 కోట్ల బకాయిలు
జిల్లాలో బీసీ, ఎస్సీ వసతి గృహాలు 132 ఉన్నా యి. వీటిలో సుమారు 19వేల మంది చదువుతున్నారు. ఒక్కో వసతి గృహానికి రూ.4లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మెస్ చార్జీలు బకాయిలు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.5.2 కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే బీసీ వసతి గృహాలకు, ఎస్సీ వసతి గృహాలకు ఐదు నెలల డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వస తి గృహ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసిన భోజనాలు పెడుతున్నామని, ఇప్పుడు కొత్త అప్పులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు తీయలేరు..!
గతంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సంక్షేమాధికారులకే నిధులు డ్రా చేసే అధికారాలు ఉండేవి. కొత్త పద్ధతిలో ఈ డ్రాయింగ్ అధి కారాలు ఏబీసీడబ్ల్యూ, లేదా ఏఎస్‌డబ్ల్యూలకు అప్పగించారు. దీని వల్ల బిల్లులు పెట్టడం సమస్యగా మారింది. ఖజానాలకు బిల్లులు వెల్లడంలోనూ, అ బిల్లులు ఆమోదం పొందడంలోనూ తీవ్ర జాప్యం అవుతోంది.
సన్నబియ్యం మాటే లేదు
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బి య్యం అందిస్తామని పాలకులు చాలాసార్లు హా మీ ఇచ్చారు. ఈ సారి మెనూ చార్జీలు పెంచినా ఈ బియ్యం విషయం మాత్రం ప్రస్తావనకు రాలేదు. ఇప్పుడు ఇస్తున్న పీడీఎస్ బియ్యం కొన్ని సార్లు నాసిరకంగా వస్తోంది. బియ్యం మినహా మిగిలిన సరుకులు, కూరగాయలు, చికెన్, గుడ్లు, పాలు, అరటి పండ్లు మొదలైనవి సంక్షేమాధికారులు కొ నుగోలు చేయాలి. అయితే వ్యాపారులు అరువులు ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు.
పెంచిన డైట్ చార్జీల మేరకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ. 38.70 పడుతుందని, కానీ మెనూ యథావిధిగా అమలు చేయడానికి రూ.50 ఖర్చు పెట్టాల్సి ఉం టుందని వార్డెన్లు చెబుతున్నారు. అలాగే ఆహార పట్టికలో పరిమాణం, ధరలు నిర్ణయించలేదు. దీంతో వార్డెన్లలో అయోమయం నెలకొంది. కొత్త మెనూ అమలు చేయడానికి నాల్గో తరగతి ఉద్యోగుల కొరత కూడా ఉంది.
మెనూ కచ్చితంగా అమలు చేస్తాం
ఈ విషయంపై బీసీ సంక్షేమ శాఖ అధికారి కె. శ్రీదేవి వద్ద ప్రస్తావించగా, మెనూ కచ్చితంగా పాటించాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్ విధానం కొత్తది కావడంతో ఇబ్బంది ఉందని, అయితే బిల్లులు పెట్టి సిద్ధంగా ఉన్నామని, వాటిని వసతి గృహ అధికారులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment