మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా..నేటికీ వారికి అవసరమైన నోట్‌పుస్తకాలు, యూనిఫాంలు, ట్రంకుపెట్టెలు పంపిణీ చేయలేదు. జిల్లాలోని మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లలో 77 బీసీ హాస్టళ్లు, 117 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి.
మొత్తం మీద 16 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులందరికీ ఇంత వరకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయలేదు. దీంతో బయట పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు కూడా ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ నోట్ పుస్తకాలను జిల్లాకు పంపలేదు.
మూడు నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మూడు పెద్ద నోట్ పుస్తకాలు, మూడు చిన్న నోట్ పుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు అందిస్తారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాల సిలబస్ మారడంతో నోట్సు రాసుకోవడం విద్యార్థులకు తప్పనిసరైంది. సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి నోట్సు ఇస్తుంటారు. ప్రభుత్వం నుంచి నోట్ పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇంటి నుంచి తెచ్చుకున్న సామగ్రిని పెట్టుకునే ట్రంకుపెట్టెలు సైతం హాస్టల్ విద్యార్థులకు అందించలేదు.
వారం రోజుల్లో రావచ్చు
బి.నరసింహారావు,బీసీ సహాయ సంక్షేమ అధికారి, మార్కాపురం
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంత వరకు జిల్లాలోని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన నోట్ పుస్తకాలు, యూనిఫాం రాలేదు. వారం రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన సామగ్రి వచ్చే అవకాశం ఉంది. రాగానే పంపిణీ చేస్తాం.
చదివేదెలా?
Published Tue, Aug 5 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement