ఇందూరు : ముందుచూపు లేని అధికారులు.. పట్టింపులేని ప్రభుత్వం.. వెరసి సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు శాపంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా, విద్యార్థులకు అందించాల్సిన సామగ్రి, వస్తువులు జిల్లాకు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నోటుబుక్కులు సరఫరా కాక పోవడంతో పాఠ్యాంశాల నమోదుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా నోట్‌బుక్కుల సరఫరా విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏటా సంక్షే మ శాఖ అధికారులు ప్రస్తుతం ఉంటున్న విద్యార్థుల తో కలిపి కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థుల సంఖ్య ను అంచనా వేసి రాష్ర్ట ఉన్నతాధికారులకు నివేదిక పంపుతారు. ఈ నివే దికను వసతిగృహాలు ప్రారంభం కాక ముందు పంపుతారు. కాని ఈ ఏడాది ముందస్తుగా నివే దికను పంపక పోవడంతో అసలుకే ఎసరు వచ్చిపడింది. పాత, కొత్త విద్యార్థుల సంఖ్యను ఆల స్యంగా పైస్థాయి అధికారులకు పంపడం, ఇటు ప్ర భుత్వం ఆలస్యంగా బైండింగ్ చేయడంతో జిల్లాకు కావాల్సిన నోట్‌బుక్కులు ఇంత వరకు రాలేదు. దీంతో పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తమ తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను నోట్‌బుక్‌లు లేక నోట్ చేసుకోవడం లేదు.
జిల్లాలో...
జిల్లాలో ఎస్సీ 67 వసతిగృహాలు, ఎస్టీ 13 వసతిగృహాలు, బీసీ 60 వసతిగృహాలు ఉన్నాయి. అందులో ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్ వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే ఎస్సీ వసతి గృహాల్లో పాత విద్యార్థులు 4,200 మంది, ఎస్టీ వసతిగృహాల్లో 1,531, బీసీ వసతి గృహాల్లో 3,000 వేల మంది మొత్తం కలిపి 8,731 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రసుత్తం కొత్త విద్యార్థులను చేర్పించడానికి వార్డెన్‌లు, మహిళా సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నారు.
పాత, కొత్త విద్యార్థులకు ఒకేసారి నోట్‌బుక్కులు అందజేయాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 18, ఎనిమిది తరగతి వారికి ఒక్కొక్కరికి 16, మిగతా తరగతుల వారికి కేటాయించిన విధంగా నోట్‌బుక్కులను ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతానికి సగం నోట్‌బుక్కులను మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం, ఎస్టీ, బీసీ సంక్షేమ విద్యార్థులకు ఇంత వరకు పంపలేదు.
పంచేదెలా..?
ఎస్సీ సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల కోసం ప్రభుత్వం సగం నోట్‌బుక్కులను జిల్లాకు పంపింది. ఇవి పాత విద్యార్థుల్లో సగం మందికే సరిపోతాయి. మిగతా వారితో పాటు కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడి నుంచి అందించాలోనని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొందరికి ఇచ్చి, మరికొందరికి ఇవ్వకుంటే బాగుండదని సమాలోచనలు చేస్తున్నారు.
తమ హాస్టల్ విద్యార్థుల కే ముందుగా ఇవ్వాలంటూ వార్డెన్‌లు నోట్‌బుక్కుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో వచ్చిన కాస్త నోట్‌బుక్కులను ఎవరికీ పంచకుండా అధికారులు అలాగే పెట్టేశారు. మొత్తం నోట్‌బుక్కులు వచ్చిన తర్వాతనే అందరికి పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త నోట్‌బుక్కులు రాక కొందరు విద్యార్థులు పాత నోట్‌బుక్కులపైనే పాఠ్యాంశాలు రాయడం, మరి కొందరేమో కొత్తవి డబ్బులకు కొనుక్కుని రాయడం లాంటివి చేస్తున్నారు. నోట్‌బుక్కులు రావాలంటే మరో వారం పది రోజులు పట్టవచ్చని సంక్షేమ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు విద్యార్థులకు ఈ బాధ తప్పేలా లేదు.
జాడలేని యూనిఫాం క్లాత్...
నోట్‌బుక్కుల విషయం ఇలా ఉంటే, విద్యార్థులకు ఏడాదికి అందించాల్సిన రెండు జతల యూనిఫాంలకు అవసరమైన క్లాత్(బట్ట) ఇంత వరకు జిల్లాకు రాలేదు. దీంతో వసతి గృహ విద్యార్థులు యూనిఫాంలు లేక రంగుల బట్టలు వేసుకుంటున్నారు. మరికొందరు పాత యూనిఫామ్స్ వేసుకుని బడికి వెలుతున్నారు. జిల్లాలో అన్ని వసతిగృహాలు కలిపి మొత్తం 12 వేల మంది విద్యార్థులు యూనిఫాంలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్లాత్ పంపించి, పిల్లల కొలతలు తీసుకుని కుట్టించే సరికి మరో నెలన్నర రోజులు పట్టేలా ఉంది. అంత వరకు విద్యార్థులు రంగులు దుస్తులు, పాత చిరిగిపోయిన యూనిఫామ్స్ వేసుకోవడం తప్పేలా లేదు.
ట్రంకు పెట్టెలు పాతవే...
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు డొక్కు ట్రంకు పెట్టెలతోనే నెట్టుకొస్తున్నారు. హాస్టళ్ల విద్యార్థులకు ఐదేళ్ల క్రితం ట్రంకు పెట్టెలను సరఫరా చేశారు. అవి పూర్తిగా పాడైపోయాయని, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి నిధులివ్వాలని ఆయా శాఖల సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదు. ఇక కొత్తగా ప్రవేశాలు పొందిన వారికి ట్రంకు పెట్టెలు ఇంత వరకు ఇవ్వలేదు.
నోట్ బుక్కులేవీ!
Published Sat, Jul 5 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement