Neglect by the government
-
బ్రెజిల్లో మరణ మృదంగం
బ్రెజీలియా: బ్రెజిల్లో కోవిడ్ –19 విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోజుకి సగటున 2 వేల మంది ప్రాణాలను కరోనా బలి తీసుకుంటోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైంది బ్రెజిల్‌లోనే. ఇప్పటివరకు 2,59,271 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నట్టుగా వరల్డో మీటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మొదట్నుంచి నిర్లక్ష్యమే: కరోనాని కట్టడి చేయడంలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో మొదట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. మాస్కులు తప్పనిసరి చేయలేదు. లాక్డౌన్ విధించడానికి ఇష్టపడలేదు. ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. బ్రెజిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఇస్తోంది. ఇప్పటివరకు 71 లక్షల మందికి ఒక్క డోసు, 21 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చింది. కేసుల తీవ్రతకి అమెజాన్ అడవులు బాగా విస్తరించిన మానస్ నగరం నుంచి నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్ పీ1 కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
సౌకర్యాలు మృగ్యం..
బెల్లంపల్లిరూరల్ : చాకేపల్లి...మండలంలోని ఏకైక గిరిజన గ్రామమైన ఇక్కడ మౌలిక వసతులు కానరావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా..అధికారులు వస్తూ వెళ్తున్నా గ్రామ రూపురేఖలు మారడం లేదు. కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామం చాకేపల్లిలో కనీస సౌకర్యాల లేమిపై ‘సాక్షి’ కథనం.. వెయ్యికి పైగా జనాభా ఉన్న చాకేపల్లిని దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఏజెన్సీ గ్రామంగా ప్రకటించింది. ఏజెన్సీ గ్రామంగా ఉండీ ఏ అభివృద్ధికి నోచడం లేదు. పంచాయతీకి మంజూరవుతున్న అరకొర నిధులే తప్పా ఐటీడీఏ నుంచి నిధులు లేకపోవడంతో అభివృద్ధి పడకేసింది. గ్రామంలో ప్రధానంగా అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. సీసీ రోడ్డు ఊసే లేకుండా పోతుంది. ప్రధాన వాడలకు సైతం సరైన రోడ్లు లేవు. మట్టి రోడ్లు గుంతలు పడి, కంకర పైకి తేలి అధ్వానంగా ఉన్నాయి. అధ్వానంగా కాలువలు.. గ్రామంలో మురుగునీటి పారుదల సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పూడిక నిండి కంపు వాసన కొడుతున్నాయి. మురుగు బయటకు వెళ్లడానికి సౌకర్యం కరువైంది. కొన్ని వాడలలో ఇంకా మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణానికి నోచడం లేదు. దీంతో మురుగు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తోంది. తాగునీటికి తంటాలు.. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. కొన్ని వాడలలో చేతిపంపులు ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో అవి పనిచేయడం లేదు. ఎండాకాలంలో నీటి సమస్య రెట్టింపవుతుంది. ప్రతి వేసవిలో గ్రామస్తులకు నీటి తిప్పలు తప్పడం లేదు. పట్టింపులేని ఐటీడీఏ.. గిరిజన గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీడీఏ శ్రద్ధ వహించడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. గ్రామంలో ఇప్పటి వరకు చెప్పుకో తగ్గ పనులేమీ చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రం కోసం ఓ భవనం నిర్మించి, కొద్దిమొత్తంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం తప్పా మరే ఇతర పనులు కల్పించలేదు. అసలు ఐటీడీఏ అధికారులు ఏడాదికోసారైనా గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. -
విద్యారంగాన్ని విస్మరించారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 40 వేలకుపైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంచుకుని, కనీస వసతులు లేని భవనాల్లో విద్యాసంస్థలను కొనసాగిస్తూ విద్యాప్రమాణాలను ఎలా మెరుగుపరుస్తారో ప్రభుత్వం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. అక్షరాస్యతలో దక్షిణ భారత దేశంలో చివరి స్థానంలో తెలంగాణ నిలిచిన విషయాన్ని విస్మరిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ఏమాత్రం మెరుగుపరచకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోనే గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటపు ప్రకటనలిస్తున్నారని ఎండగట్టారు. బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రానురానూ తగ్గుతున్న వాస్తవాన్ని సర్కారు గుర్తించడం లేదన్నారు. ఉన్నత విద్య ఇంతకన్నా ఘోరంగా ఉందన్నారు. బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం, కనీస వసతుల కొరత వంటి సమస్యలతో వర్సిటీలు కునారిల్లుతున్నాయన్నారు. ఓడిపోతామన్న భయంతోనే పంచాయతీలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
నోట్ బుక్కులేవీ!
ఇందూరు : ముందుచూపు లేని అధికారులు.. పట్టింపులేని ప్రభుత్వం.. వెరసి సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు శాపంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా, విద్యార్థులకు అందించాల్సిన సామగ్రి, వస్తువులు జిల్లాకు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నోటుబుక్కులు సరఫరా కాక పోవడంతో పాఠ్యాంశాల నమోదుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నోట్బుక్కుల సరఫరా విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏటా సంక్షే మ శాఖ అధికారులు ప్రస్తుతం ఉంటున్న విద్యార్థుల తో కలిపి కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థుల సంఖ్య ను అంచనా వేసి రాష్ర్ట ఉన్నతాధికారులకు నివేదిక పంపుతారు. ఈ నివే దికను వసతిగృహాలు ప్రారంభం కాక ముందు పంపుతారు. కాని ఈ ఏడాది ముందస్తుగా నివే దికను పంపక పోవడంతో అసలుకే ఎసరు వచ్చిపడింది. పాత, కొత్త విద్యార్థుల సంఖ్యను ఆల స్యంగా పైస్థాయి అధికారులకు పంపడం, ఇటు ప్ర భుత్వం ఆలస్యంగా బైండింగ్ చేయడంతో జిల్లాకు కావాల్సిన నోట్‌బుక్కులు ఇంత వరకు రాలేదు. దీంతో పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తమ తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను నోట్బుక్లు లేక నోట్ చేసుకోవడం లేదు. జిల్లాలో... జిల్లాలో ఎస్సీ 67 వసతిగృహాలు, ఎస్టీ 13 వసతిగృహాలు, బీసీ 60 వసతిగృహాలు ఉన్నాయి. అందులో ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్ వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే ఎస్సీ వసతి గృహాల్లో పాత విద్యార్థులు 4,200 మంది, ఎస్టీ వసతిగృహాల్లో 1,531, బీసీ వసతి గృహాల్లో 3,000 వేల మంది మొత్తం కలిపి 8,731 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రసుత్తం కొత్త విద్యార్థులను చేర్పించడానికి వార్డెన్లు, మహిళా సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత, కొత్త విద్యార్థులకు ఒకేసారి నోట్‌బుక్కులు అందజేయాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 18, ఎనిమిది తరగతి వారికి ఒక్కొక్కరికి 16, మిగతా తరగతుల వారికి కేటాయించిన విధంగా నోట్బుక్కులను ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతానికి సగం నోట్బుక్కులను మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం, ఎస్టీ, బీసీ సంక్షేమ విద్యార్థులకు ఇంత వరకు పంపలేదు. పంచేదెలా..? ఎస్సీ సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల కోసం ప్రభుత్వం సగం నోట్బుక్కులను జిల్లాకు పంపింది. ఇవి పాత విద్యార్థుల్లో సగం మందికే సరిపోతాయి. మిగతా వారితో పాటు కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడి నుంచి అందించాలోనని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొందరికి ఇచ్చి, మరికొందరికి ఇవ్వకుంటే బాగుండదని సమాలోచనలు చేస్తున్నారు. తమ హాస్టల్ విద్యార్థుల కే ముందుగా ఇవ్వాలంటూ వార్డెన్లు నోట్బుక్కుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో వచ్చిన కాస్త నోట్బుక్కులను ఎవరికీ పంచకుండా అధికారులు అలాగే పెట్టేశారు. మొత్తం నోట్‌బుక్కులు వచ్చిన తర్వాతనే అందరికి పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త నోట్‌బుక్కులు రాక కొందరు విద్యార్థులు పాత నోట్బుక్కులపైనే పాఠ్యాంశాలు రాయడం, మరి కొందరేమో కొత్తవి డబ్బులకు కొనుక్కుని రాయడం లాంటివి చేస్తున్నారు. నోట్‌బుక్కులు రావాలంటే మరో వారం పది రోజులు పట్టవచ్చని సంక్షేమ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు విద్యార్థులకు ఈ బాధ తప్పేలా లేదు. జాడలేని యూనిఫాం క్లాత్... నోట్బుక్కుల విషయం ఇలా ఉంటే, విద్యార్థులకు ఏడాదికి అందించాల్సిన రెండు జతల యూనిఫాంలకు అవసరమైన క్లాత్(బట్ట) ఇంత వరకు జిల్లాకు రాలేదు. దీంతో వసతి గృహ విద్యార్థులు యూనిఫాంలు లేక రంగుల బట్టలు వేసుకుంటున్నారు. మరికొందరు పాత యూనిఫామ్స్ వేసుకుని బడికి వెలుతున్నారు. జిల్లాలో అన్ని వసతిగృహాలు కలిపి మొత్తం 12 వేల మంది విద్యార్థులు యూనిఫాంలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్లాత్ పంపించి, పిల్లల కొలతలు తీసుకుని కుట్టించే సరికి మరో నెలన్నర రోజులు పట్టేలా ఉంది. అంత వరకు విద్యార్థులు రంగులు దుస్తులు, పాత చిరిగిపోయిన యూనిఫామ్స్ వేసుకోవడం తప్పేలా లేదు. ట్రంకు పెట్టెలు పాతవే... ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు డొక్కు ట్రంకు పెట్టెలతోనే నెట్టుకొస్తున్నారు. హాస్టళ్ల విద్యార్థులకు ఐదేళ్ల క్రితం ట్రంకు పెట్టెలను సరఫరా చేశారు. అవి పూర్తిగా పాడైపోయాయని, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి నిధులివ్వాలని ఆయా శాఖల సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదు. ఇక కొత్తగా ప్రవేశాలు పొందిన వారికి ట్రంకు పెట్టెలు ఇంత వరకు ఇవ్వలేదు. -
సోయాబీన్ సబ్సిడీ విత్తనాలపై ఆందోళనలో రైతులు
మోర్తాడ్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన సోయాబీన్ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. దీంతో రానున్న ఖరీఫ్ సీజన్లో సోయా విత్తనాలు అందుతాయో లేవో అనే సంశయం రైతుల్లో నెలకొంది. ఇప్పటికే జిల్లాకు అవసరమైన సోయా విత్తనాలు వ్యవసాయ శాఖ గిడ్డంగులకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంత వరకు సోయా విత్తనాల జాడలేదు. జిల్లాలో... ఖరీఫ్ సీజన్‌కు గాను జిల్లాకు 90 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర అధికారులు మాత్రం 75 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను సరఫరా చేసేందుకు ఆమోదముద్ర వేశారు. దశల వారీగా విత్తనాలు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. గతంలో ఇదే నెలలోనే సోయా విత్తనాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఏజెన్సీలు దిగుమతి చేసుకుని వ్యవసాయ శాఖకు అప్పగించేవి. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సోయా విత్తనాలను సరఫరా చేయడానికి ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. జిల్లాకు అవసరమైన సోయా విత్తనాలను ఆయిల్‌ఫెడ్, హాకా, ఏపీ సీడ్స్ తదితర ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. విత్తనాలను రైతులకు 33 శాతం సబ్సిడీపై అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో రైతులు సబ్సిడీ పోను ధర చెల్లించి విత్తనాలను కొనుగోలు చేయాల్సి ఉండేది. గతేడాది మాత్రం సబ్సిడీ సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతులు సహకార సంఘాల్లో విత్తనాలకు పూర్తి ధరను చెల్లించి కొనుగోలు చేస్తే, కొన్ని రోజుల తర్వాత వారి ఖాతాల్లో సోయా సబ్సిడీ సొమ్ము జమ అయ్యేది. ఏజెన్సీలకు ఆర్థిక ఇబ్బందులు అయితే రైతుల విషయం ఎలా ఉన్నా, ఏజెన్సీ లు మాత్రం తమ సొంత నిధులను కేటాయించి విత్తనాలను కొనుగోలు చేసి వ్యవసాయ శాఖకు అప్పగించేవి. ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లుల రూపంలో సొమ్మును చెల్లించేది. గతేడాదికి సంబంధించిన నిధులను విడుదల చేయడంలో జాప్యం ఏర్పడటంతో ఈ సీజనుకు సంబంధించిన విత్తనాలను సరఫరా చేయలేమని ఏజెన్సీలు చేతులెత్తేసినట్లు తెలిసింది. ఏజెన్సీలు ప్రభుత్వ అనుబంధ సంస్థలే అయినప్పటికీ, అవి ఆర్థికంగా బలంగా లేకపోవడం, వాటిని బలపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో సంస్థలు నీరుగారాయి. ఈ సీజనుకు సంబంధించి విత్తనాలను తాము సరఫరా చేయలేమని ఏజెన్సీల ప్రతినిధులు తేల్చి చెప్పడంతో రైతులకు పాలుపోవడం లేదు. సోయా విత్తనాలను సరఫరా చేయలేమని ఏజెన్సీల ప్రతినిధులు ముందుగానే చెప్పడంతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వ్యవసాయ శాఖ అధికారులు బిజీగా ఉన్నారు. సహకార సంఘాల ద్వారా నిధులను ఏజెన్సీలకు ఇప్పిం చి, సోయా విత్తనాలను సరఫరా చేయించడానికి వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి లో ఒక సమావేశం నిర్వహించారు. సహకార సంఘాల ద్వారానే సోయా విత్తనాలను విక్రయించే అవకాశం ఉండటంతో ఇప్పుడు అవసరమైన పెట్టుబడిని సహకార బ్యాంకు ద్వారా పెట్టి ఏజెన్సీల ద్వారా విత్తనాలను పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కాగా పెట్టుబడిని పెట్టే విషయాన్ని ఇంకా సహకార బ్యాంకు పాలకవర్గం తేల్చలేదు. చర్చలు ఇంకా సాగుతుండటంతో విత్తనాలు ఎప్పుడు సరఫరా అవుతాయో అధికారులు చెప్పలేక పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి విత్తనాలను త్వరగా జిల్లాకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.