చంద్రవెల్లి గ్రామంలోని ఓ వాడకు వెళ్లే మట్టిరోడ్డు
బెల్లంపల్లిరూరల్ : చాకేపల్లి...మండలంలోని ఏకైక గిరిజన గ్రామమైన ఇక్కడ మౌలిక వసతులు కానరావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా..అధికారులు వస్తూ వెళ్తున్నా గ్రామ రూపురేఖలు మారడం లేదు. కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామం చాకేపల్లిలో కనీస సౌకర్యాల లేమిపై ‘సాక్షి’ కథనం..
వెయ్యికి పైగా జనాభా ఉన్న చాకేపల్లిని దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఏజెన్సీ గ్రామంగా ప్రకటించింది. ఏజెన్సీ గ్రామంగా ఉండీ ఏ అభివృద్ధికి నోచడం లేదు. పంచాయతీకి మంజూరవుతున్న అరకొర నిధులే తప్పా ఐటీడీఏ నుంచి నిధులు లేకపోవడంతో అభివృద్ధి పడకేసింది. గ్రామంలో ప్రధానంగా అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. సీసీ రోడ్డు ఊసే లేకుండా పోతుంది. ప్రధాన వాడలకు సైతం సరైన రోడ్లు లేవు. మట్టి రోడ్లు గుంతలు పడి, కంకర పైకి తేలి అధ్వానంగా ఉన్నాయి.
అధ్వానంగా కాలువలు..
గ్రామంలో మురుగునీటి పారుదల సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పూడిక నిండి కంపు వాసన కొడుతున్నాయి. మురుగు బయటకు వెళ్లడానికి సౌకర్యం కరువైంది. కొన్ని వాడలలో ఇంకా మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణానికి నోచడం లేదు. దీంతో మురుగు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తోంది.
తాగునీటికి తంటాలు..
గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. కొన్ని వాడలలో చేతిపంపులు ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో అవి పనిచేయడం లేదు. ఎండాకాలంలో నీటి సమస్య రెట్టింపవుతుంది. ప్రతి వేసవిలో గ్రామస్తులకు నీటి తిప్పలు తప్పడం లేదు.
పట్టింపులేని ఐటీడీఏ..
గిరిజన గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీడీఏ శ్రద్ధ వహించడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. గ్రామంలో ఇప్పటి వరకు చెప్పుకో తగ్గ పనులేమీ చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రం కోసం ఓ భవనం నిర్మించి, కొద్దిమొత్తంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం తప్పా మరే ఇతర పనులు కల్పించలేదు. అసలు ఐటీడీఏ అధికారులు ఏడాదికోసారైనా గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment