మోర్తాడ్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన సోయాబీన్ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. దీంతో రానున్న ఖరీఫ్ సీజన్‌లో సోయా విత్తనాలు అందుతాయో లేవో అనే సంశయం రైతుల్లో నెలకొంది. ఇప్పటికే జిల్లాకు అవసరమైన సోయా విత్తనాలు వ్యవసాయ శాఖ గిడ్డంగులకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంత వరకు సోయా విత్తనాల జాడలేదు.
జిల్లాలో...
ఖరీఫ్ సీజన్‌కు గాను జిల్లాకు 90 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర అధికారులు మాత్రం 75 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను సరఫరా చేసేందుకు ఆమోదముద్ర వేశారు. దశల వారీగా విత్తనాలు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. గతంలో ఇదే నెలలోనే సోయా విత్తనాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఏజెన్సీలు దిగుమతి చేసుకుని వ్యవసాయ శాఖకు అప్పగించేవి. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సోయా విత్తనాలను సరఫరా చేయడానికి ఏజెన్సీలు ముందుకు రావడం లేదు.
జిల్లాకు అవసరమైన సోయా విత్తనాలను ఆయిల్‌ఫెడ్, హాకా, ఏపీ సీడ్స్ తదితర ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. విత్తనాలను రైతులకు 33 శాతం సబ్సిడీపై అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో రైతులు సబ్సిడీ పోను ధర చెల్లించి విత్తనాలను కొనుగోలు చేయాల్సి ఉండేది.
గతేడాది మాత్రం సబ్సిడీ సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతులు సహకార సంఘాల్లో విత్తనాలకు పూర్తి ధరను చెల్లించి కొనుగోలు చేస్తే, కొన్ని రోజుల తర్వాత వారి ఖాతాల్లో సోయా సబ్సిడీ సొమ్ము జమ అయ్యేది.
ఏజెన్సీలకు ఆర్థిక ఇబ్బందులు
అయితే రైతుల విషయం ఎలా ఉన్నా, ఏజెన్సీ లు మాత్రం తమ సొంత నిధులను కేటాయించి విత్తనాలను కొనుగోలు చేసి వ్యవసాయ శాఖకు అప్పగించేవి. ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లుల రూపంలో సొమ్మును చెల్లించేది. గతేడాదికి సంబంధించిన నిధులను విడుదల చేయడంలో జాప్యం ఏర్పడటంతో ఈ సీజనుకు సంబంధించిన విత్తనాలను సరఫరా చేయలేమని ఏజెన్సీలు చేతులెత్తేసినట్లు తెలిసింది. ఏజెన్సీలు ప్రభుత్వ అనుబంధ సంస్థలే అయినప్పటికీ, అవి ఆర్థికంగా బలంగా లేకపోవడం, వాటిని బలపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో సంస్థలు నీరుగారాయి.
ఈ సీజనుకు సంబంధించి విత్తనాలను తాము సరఫరా చేయలేమని ఏజెన్సీల ప్రతినిధులు తేల్చి చెప్పడంతో రైతులకు పాలుపోవడం లేదు. సోయా విత్తనాలను సరఫరా చేయలేమని ఏజెన్సీల ప్రతినిధులు ముందుగానే చెప్పడంతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వ్యవసాయ శాఖ అధికారులు బిజీగా ఉన్నారు. సహకార సంఘాల ద్వారా నిధులను ఏజెన్సీలకు ఇప్పిం చి, సోయా విత్తనాలను సరఫరా చేయించడానికి వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి లో ఒక సమావేశం నిర్వహించారు.
సహకార సంఘాల ద్వారానే సోయా విత్తనాలను విక్రయించే అవకాశం ఉండటంతో ఇప్పుడు అవసరమైన పెట్టుబడిని సహకార బ్యాంకు ద్వారా పెట్టి ఏజెన్సీల ద్వారా విత్తనాలను పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కాగా పెట్టుబడిని పెట్టే విషయాన్ని ఇంకా సహకార బ్యాంకు పాలకవర్గం తేల్చలేదు. చర్చలు ఇంకా సాగుతుండటంతో విత్తనాలు ఎప్పుడు సరఫరా అవుతాయో అధికారులు చెప్పలేక పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి విత్తనాలను త్వరగా జిల్లాకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.