మోర్తాడ్, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్న తరుణం లో వ్యవసాయ పరికరాలపై వ్యవసాయ శాఖ సబ్సిడీ ఎత్తివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 20 రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. ముందే పరికరాలను తీసుకుంటే ఖరీఫ్‌లో ఉపయోగపడతాయని భావించిన రైతులకు అధికారులు నిర్ణయం నిరాశను మిగిల్చింది.
ఇటీవల వ్యవసాయ పరికరాలపై సబ్సిడీని అధికారులు ఎత్తివేశారు. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతనే పరికరాలకు సబ్సిడీని వర్తింపజేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నో పరికరాలను రైతులు కొనుగోలు చేయాల్సి ఉంది. సబ్సిడీ ఎత్తివేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి పరికరాలను కొనుగోలు చేయాలంటే కష్టం అవుతుందని రైతులు వాపోతున్నారు.
కల్టివేటర్‌లు, ఫ్లవ్స్, రోటోవేటర్‌లు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్స్, స్ప్రెయర్‌లు, మొక్కజొన్న ఒలిచే యంత్రాలు వంటి పరికరాలు వ్యవసాయంలో చాలా అవసరం.
ఈ అన్ని పరికరాలు వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఉన్నా సబ్సిడీ లేకపోవడంతో రైతులు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. కల్టివేటర్ ధర మార్కెట్‌లో రూ. 29 వేలుగా ఉంది. ఫ్లవ్స్ రూ. 12 వేలు, రోటోవేటర్ రూ.90 వేలు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్ ధర రూ. 25 వేలుంది. పరికరం ధరను బట్టి 33 నుంచి 60 శాతం వరకు సబ్సిడీని గతంలో ప్రభుత్వం అందించేది. ప్రస్తుతం సబ్సిడీ ఎత్తివేయడం వల్ల రైతులపై అదనపు భారం పడుతోంది. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఖరీఫ్ సీజన్‌కు అవసరం ఉన్న పరికరాలకు సబ్సిడీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఎత్తివేత
Published Fri, May 23 2014 3:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement