న్యూస్‌లైన్, మోర్తాడ్ : లక్ష రూపాయలలోపు పంట రుణం ఉంటేనే రుణ మాఫీ వర్తిస్తుం దని గత ప్రభుత్వం ప్రకటించడంతో ఎక్కువ మంది రైతులు పంట రుణాలను లక్ష రూపాయలలోపు మాత్రమే తీసుకున్నారు. చిన్న, సన్నకారు రైతులు బ్యాంకులు, సహకార సంఘాలలో పంటల సాగుకు రుణం తీసుకుని పెట్టుబడులు పెట్టారు. రైతులు తమకు ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణం ప్రకారం బ్యాంకులు, సహకార సంఘాలలో రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాలు తీసుకున్నారు. ప్రతి ఖరీఫ్ సీజన్‌కు ముందుగా రుణాలను చెల్లించి మళ్లీ రుణాలను తీసుకునేవారు. కొందరు రైతులు జనవరిలోనే రుణాలను చెల్లించి మళ్లీ జూన్‌లో రుణం పొందేవారు.
అయితే ఈ సారి రుణ మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు ప్రకటించడంతో బ్యాంకర్లు ఒత్తిడి తెచ్చినా రైతులు రుణాలను చెల్లించలేదు. రుణ మాఫీపై మాట నిలబెట్టుకుంటామని కేసీఆర్ పలు మార్లు ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో చాలా మంది రైతులు రుణ మాఫీపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పంట రుణాల మాఫీపై స్పష్టత రావాల్సి ఉంది. రుణమాఫీ పంట రుణాలకే పరిమితమా, వ్యవసాయాభివృద్ధి కోసం తీసుకున్న టర్మ్ లోన్లకూ వర్తిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
తిరిగి రుణాలిస్తారా?
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. భూమిలో సారం నింపే పనులు చేస్తున్నారు. పశువుల పేడ, కోళ్ల పేడ, వర్మి కంపోస్టు, నల్లమట్టి, ఇతర భూసారం పెంచే చర్యలను రైతులు చేపట్టారు. వచ్చేనెల రెండోవారం నుంచి పనులు ఊపందుకోనున్నాయి. అయితే పంటల సాగుకు సమయం ఉన్నా.. పెట్టుబడులు పెట్టడం మొదలైంది. అయితే జూన్ రెండో వారానికి పంటలకు పెట్టుబడి కోసం రైతులకు డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి. జూన్ రెండో తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పక్షం రోజుల్లోగా పంట రుణాలు మాఫీ చేయడం, కొత్త రుణాలను ఇవ్వడం సాధ్యమేనా అన్న అనుమానాలు అన్నదాతలను తొలుస్తున్నాయి. పంట రుణాలు ఇప్పుడు మాఫీ అయినా బ్యాంకులకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూరితేనే కొత్త రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని బ్యాంకర్లు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో యూపీఏ సర్కార్ రుణాలను మాఫీ చేయగా బ్యాంకులకు రుణాల మాఫీకి సంబంధించిన నిధులు ఇవ్వలేదు. రుణాలు మాఫీ కావడంతో కొత్త రుణాల కోసం రైతులు ఒత్తిడి చేయగా బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు బ్యాంకుల లాభాల నుంచి కొత్త రుణాలను పంపిణీ చేశారని బ్యాంకర్ల ద్వారా తెలిసింది. పంట రుణాల పరిమితి పెరగడంతో ఒక్కో బ్యాంకు శాఖలో రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పంట రుణాలు ఉన్నాయి. బ్యాంకులకు పెద్ద మొత్తంలో నిధులను ప్రభుత్వం సమకూర్చితే తప్ప కొత్త రుణాలకు అవకాశం కనిపించడం లేదు. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం తర్వాతనే పంట రుణాల మాఫీ, కొత్త రుణాల మంజూరీపై స్పష్టత వస్తుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఘోర పరాభవంపై కాంగ్రెస్ సమీక్ష
Published Sat, May 24 2014 2:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement