సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 40 వేలకుపైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంచుకుని, కనీస వసతులు లేని భవనాల్లో విద్యాసంస్థలను కొనసాగిస్తూ విద్యాప్రమాణాలను ఎలా మెరుగుపరుస్తారో ప్రభుత్వం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. అక్షరాస్యతలో దక్షిణ భారత దేశంలో చివరి స్థానంలో తెలంగాణ నిలిచిన విషయాన్ని విస్మరిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ఏమాత్రం మెరుగుపరచకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోనే గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటపు ప్రకటనలిస్తున్నారని ఎండగట్టారు.
బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రానురానూ తగ్గుతున్న వాస్తవాన్ని సర్కారు గుర్తించడం లేదన్నారు. ఉన్నత విద్య ఇంతకన్నా ఘోరంగా ఉందన్నారు. బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం, కనీస వసతుల కొరత వంటి సమస్యలతో వర్సిటీలు కునారిల్లుతున్నాయన్నారు. ఓడిపోతామన్న భయంతోనే పంచాయతీలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment