కలుషితాహారంతో అస్వస్థత | sickness with food poisoning | Sakshi
Sakshi News home page

కలుషితాహారంతో అస్వస్థత

Published Wed, Aug 13 2014 1:49 AM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM

sickness with food poisoning

మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట నాసిరకపు భోజనం తిని విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితాహారం తిని మార్కాపురంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినుల కథనం మేరకు..హాస్టల్లో ఆదివారం రాత్రి అన్నం తిన్న తరువాత  8వ తరగతి విద్యార్థిని మేఘావత్ మహేశ్వరిబాయి(కాటంరాజు తండా), 5వ తరగతి చదువుతున్న పీ విజయలక్ష్మి, ఆర్.నాగమణి, పుష్పలత (దొనకొండ మండలం బూనపల్లి), నాలుగో తరగతి చదువుతున్న ఎం.శివాని (వైపాలెం మండలం వాదంపల్లి), చరితకు స్వల్పంగా కడుపునొప్పి వచ్చింది.

అయినా అలాగే సోమవారం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నానికి కడుపునొప్పికి తోడు వాంతులు కావడంతో హాస్టల్ వార్డెన్ ఎం.సుబ్బలక్ష్మి రాత్రి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. మంగళవారం ఉదయానికి కానీ విషయం బయటకు తెలియలేదు.  సాయంత్రం మరో ఐదుగురు విద్యార్థినులు కూడా అస్వస్థతకు గురయ్యారు. 6వ తరగతి చదువుతున్న నాగలక్ష్మీబాయి, 7వ తరగతి చదువుతున్న వీ.నాగలక్ష్మీబాయి (మల్లాపాలెం), 4వ తరగతి చదువుతున్న డి.నాగలక్ష్మీబాయి, డి.ప్రియాంకబాయి (పీఆర్సీ తండా), పదో తరగతి చదువుతున్న సీహెచ్ సావిత్రి (పుచ్చకాయలపల్లి) తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో మార్కాపురం ఏరియా వైద్యశాలలో చేర్చారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆర్డీవో పీ కొండయ్య, డిప్యూటీ డీఈవో కాశీశ్వరరావులు వైద్యశాలకు వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినుల పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తహశీల్దార్ నాగభూషణం, ఆర్‌ఐ ఖలీల్, ఎంఈవో సీహెచ్‌పీ వెంకటరెడ్డిలు ఘటనపై విచారణ చేపట్టారు.

 మీ పిల్లలను ఇలాగే చూస్తారా:  వార్డెన్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
 వైద్యశాల నుంచి ఎస్టీ బాలికల హాస్టల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వార్డెన్ లక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్‌కు వెళ్లగా అక్కడ కుళ్లిపోయిన టమోటాలు, బూజుపట్టిన ఉల్లిగడ్డలు, మగ్గిపోయిన వంకాయలను చూసి ఇలాంటి వాటితో వండి అన్నంలో పెడితే విద్యార్థినుల ఆరోగ్యం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో ‘మీ ఇంటిని ఇలాగే ఉంచుకుంటారా, మీ పిల్లలను ఇలాగే చూస్తారా’ అంటూ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు హాస్టల్‌కు చిన్నారులను పంపుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

 ప్రాణాపాయం లేదు:
 చికిత్స అందిస్తున్న వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ సోమవారం రాత్రి వార్డెన్ విద్యార్థినులను హడావుడిగా వైద్యశాలకు తీసుకుని రాగా, అవసరాన్ని బట్టి ఒక విద్యార్థినికి 8 నుంచి 12 సెలైన్ బాటిల్స్ పెట్టినట్లు తెలిపారు. కలుషితాహారం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతున్నామని చెప్పిన వెంటనే ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల యూత్ అధ్యక్షుడు మందటి మహేశ్వరరెడ్డి, సొసైటీ డెరైక్టర్ నల్లబోతుల కొండయ్య ఉన్నారు. మార్కాపురం ఏటీడబ్ల్యూఓ ఎస్.దస్తగిరి విద్యార్థినులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement