సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వణుకు | No Bed Sheets for students in Social welfare hostels | Sakshi
Sakshi News home page

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వణుకు

Published Thu, Nov 7 2013 4:11 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

No Bed Sheets for students in Social welfare hostels

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 73 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 5,544 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత జూలైలో విద్యార్థులకు బెడ్‌షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా.. దుప్పట్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 70 బీసీ హాస్టళ్లలో 4,560 మంది చదువుకుంటున్నారు. ఇందులో 2,755 మందికి విద్యా సంవత్సరం ప్రారంభంలో బెడ్‌షీట్ల్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. 1,805 మంది విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో చలికి వణుకుతున్నారు. జిల్లాలోని 123 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. మొదట్లో 34,354 మందికి బెడ్‌షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 4,800 బెడ్‌షీట్ల కోసం ప్రతిపాదనలు పంపించగా 2,100 ఇటీవల రావడంతో పంపిణీ చేశామని, మరో 2,700 ఈ వారంలో వస్తాయని చెబుతున్నారు.
 
 సాంఘిక సంక్షేమ శాఖలో గత మార్చిలో హాస్టళ్లలో తలుపులు, కిటికీల మరమ్మతుల కోసం రూ.78 లక్షలు మంజూరు కాగా, 17 హాస్టళ్లలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో రూ.30 లక్షలతో 11 హాస్టళ్లలో మరమ్మతుల పనులు మంజూరు కాగా, అవి టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. బీసీ హాస్టళ్లకు సంబంధించి ఇటీవల రూ.58 లక్షలతో 34 హాస్టళ్లలో మరమ్మతులు నిర్వహించామని, మిగతా హాస్టళ్లలో సమస్యలు లేవని అధికారులు చెబుతుండగా ‘న్యూస్‌లైన్ విజిట్’లో అనేక బీసీ హాస్టళ్లలో కళ్లకు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి.
 
 హాస్టళ్లలో విద్యార్థుల గజగజ
 ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలో కిటికీలకు తలుపు లేకపోవడంతో రాత్రి వేళ చల్లని గాలిని విద్యార్థులు తట్టుకోలేక పోతున్నారు. గజగజ వణుకుతూనే నిద్రపోతున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న చిరిగిన బొంతలను కప్పుకుని చలి బారి నుంచి కాపాడుకుంటున్నారు. బేలలోని కస్తూర్భా పాఠశాలలో కిటికీలకు జాలీలు విరిగిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. చెన్నూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో దుప్పట్లు పంపిణీ కాకపోవడంతో చలికి వణుకుతూనే పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. జైనూర్ మండలం మర్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటే చల్లటి నీళ్లతో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గం వసతి గృహాల్లోని విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు.
 
 అయితే కొన్ని వసతిగృహాలకు అధికారులను దుప్పట్లు అప్పగించినప్పటికీ మరికొన్ని వసతిగృహాల్లో అందించలేదు. నిర్మల్ బీసీ వసతి గృహం, సారంగాపూర్ మండలం జామ్ ఎస్సీ వసతి గృహాల్లో గదులకు సరైన కిటికీలు, తలుపులు లేవు. నిర్మల్ బీసీ వసతి గృహంలో కిటికీలకు, గదులకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జామ్ ఎస్సీ వసతి గృహానికి సరైన కిటికీలు లేక విద్యార్థులు చలికి వేగలేకపోతున్నారు. దిలావర్‌పూర్ బీసీ వసతి గృహం కొత్తగా నిర్మించారు. అయితే స్నానపు గదుల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. బెల్లంపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 20 మందికి, బెల్లంపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం విద్యార్థులు 24 మందికి దుప్పట్లు పంపిణీ చేయలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement