సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. సర్కారు అందించే ప్రతీ పైసాలోనూ ఉన్నతాధికారులు సైతం వాటాకొట్టేస్తున్నారు. పిల్లల కడుపులు కొట్టి తామ చక్కగా ఆస్తులు కూడబెడుతున్నారు. ఏసీబీ అధికారుల దాడులతో ఈ వాస్తవం కాస్తా బట్టబయలైంది. కాస్మొటిక్ చార్జీల్లోనూ మామ్మూళ్లు వసూలు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు.
విజయనగరం కంటోన్మెంట్: హాస్టల్ పిల్లలకు కాస్మొటిక్ చార్జీల పేరిట ఏటా సర్కారు నిధులు విడుదల చేస్తుంది. అందులో ఒక్కో విద్యార్థినుంచి పదిరూపాయలు వంతున వసూలు చేసి ఆ మొత్తాన్ని జిల్లా అధికారికి అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలోని బీసీ వసతి గృహాల వార్డెన్ల సంఘం అధ్యక్షుడు మోహనరావు ఆ శాఖ ఇన్‌ఛార్జి అధికారి అయిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.రాజుకు అలా సేకరించిన మొత్తాన్ని రూ.1.15లక్షలు ఇస్తుండ గా శనివారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ మొత్తం అందతుందన్న సమాచారంతో ఏసీబీ డీఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి, సీఐలు ఎస్ లకో్ష్మజి, డి.రమేష్, హెచ్‌సీ స్వామినాయుడుతో కలసి దాడులు నిర్వహించారు. ఆ నగదును స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేపట్టారు. నివేదికను ఏసీబీ కోర్టుకు అందజేసి ఆపై వచ్చిన ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలుంటాయని డీఎస్పీ ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు.
నిర్వహణలో అక్రమాలనుంచి గట్టెక్కేందుకే...
వసతి గృహాలు సక్రమంగా నిర్వహించడం లేదు, మెనూ అమలుకు అరకొరగా నిధులొస్తున్నా అందులోనూ కోతపెట్టి నాసిరకంగా భోజనం అందిస్తున్నారు. ఇవి సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ప్రతి పది రోజులకోసారి సంక్షేమాధికారులు తనిఖీ చేయాలి. వారి పరిశీలనలో గుర్తించిన అంశాలపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలి. కానీ జిల్లా సంక్షేమాధికారులు వసతి గృహాల తనిఖీకి రానీయకుండా వార్డెన్లు ప్రతీ నెలా కొంత మొత్తాన్ని అందిస్తున్నారు.
రూ. నెలకు రెండుకోట్ల బిల్లులు
జిల్లాలో 58 బీసీ వెల్ఫేర్ వసతి గృహాలున్నాయి. ప్రతీ వసతిగృహంలో సుమా రు వంద మంది విద్యార్థులు ఉంటారు. వీరికి ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు సక్రమంగా ఇవ్వరు. ఇచ్చిన దాంట్లో కోత పెడుతుంటారు. ఒక్కో విద్యార్థికి వచ్చే మొత్తంలో పదిరూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. జిల్లాలోని బీసీ వెల్ఫేర్ వసతి గృహాల్లో విద్యుత్ బిల్లులు, పేపర్ బిల్లులు, కూరగాయలు, వంట కు సంబంధించిన వస్తువులతో పాటు ఆటవస్తువులు, మరమ్మతులు తదితర నిత్యం జరుగని పనులకూ బిల్లులు పెడుతుంటారనే ప్రచారం ఉంది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా సుమారు రూ. రెండు కోట్ల బిల్లులు అవుతాయని ఓ అంచనా! వార్డెన్లు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి వచ్చిన బిల్లుల్లో కొంత మొత్తాన్ని ఉన్నతాధికారులకు లంచాలుగా ఇస్తున్నారు. అందుకే వారు ఏ వార్డెన్‌పైనా తీసుకున్న చర్యలు తక్కువగానే ఉంటున్నాయి.
ఇన్‌చార్జి బాధ్యతల్లో అడ్డంగా బుక్కయిన అధికారి!
ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న ఎం.రాజుకు ఇటీవలే జిల్లా కలెక్టర్ బీసీ వెల్ఫేర్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు పనిచేసిన కె.వి. ఆదిత్యలక్ష్మికి బదిలీ అవడంతో ఆ బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో కోట్లాది రూపాయల రుణాల వ్యవహారం నడుస్తున్నప్పటికీ అందులో ఎటువంటి లోపాలూ బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారి ఇన్‌చార్జి పోస్టులో మాత్రం రూ. లక్షా 15వేలు తీసుకుంటూ బుక్కయిపోవడం విశేషం.
సిగ్గు.. సిగ్గు...
Published Sun, Feb 7 2016 3:38 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement