సంక్షేమ హాస్టళ్లకు సేంద్రియ పంట!
Published Tue, Aug 8 2017 1:53 AM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
- 514 సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిచెన్ గార్డెన్లు
- నేడు రెండు చోట్ల ప్రారంభించనున్న వ్యవసాయ మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 514 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందించేందుకు ఉద్యాన శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కిచెన్ గార్డెన్లలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిం ది. ముందుగా కామారెడ్డి జిల్లా జంగంపల్లి, బూరగాం హాస్టళ్లలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కిచెన్ గార్డెన్లకు మంగళ వారం ప్రారంభోత్సవం చేస్తారని ఆ శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
సూక్ష్మ సేద్యం, విత్తనాలు సరఫరా
సంక్షేమ హాస్టళ్లకు ఉన్న భూమిని ఖాళీగా వదిలేయకుండా వాటిలో అవసరమైన సేంద్రి య కూరగాయలు పండించాలని, వాటినే విద్యార్థులకు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటారని భావన. ఆ ప్రకారం కనీసం ఐదు నుంచి ఏడెకరాల వరకు స్థలం ఉన్న హాస్టళ్లను గుర్తించారు. ఆ భూమిలో నిమ్మ, సీతాఫలం, మామిడి తదితర పండ్ల తోటలు కూడా పెంచుతారు. అలాగే టమాట, వంకాయ, చిక్కుడు, కాకర, బీర, దొండ, పొట్ల తదితర కూరగాయలు పండిస్తారు. పాలకూర, చుక్కకూర, పొనగంటికూర, కొత్తిమీర, పుదీన వంటి వాటిని పండిస్తారు. ఇందుకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలు, రోజువారీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఆయా తోటలకు నీటిని సరఫరా చేసేందుకు సూక్ష్మ సేద్యం పరికరాలను బిగించి ఇస్తారు.
విద్యార్థులే గ్రీన్ బ్రిగేడియర్లు: కిచెన్ గార్డెన్లపై రోజువారీ నిర్వహణ బాధ్యత, చెట్ల పెంపకంపై ఆసక్తి పెంచేందుకు ఆయా హాస్టల్ విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడియర్లను సిద్ధం చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. వాటి పెంపకంపై వార్డెన్లకు శిక్షణ ఇస్తామన్నారు. కిచెన్ గార్డెన్లలో నూటికి నూరు శాతం సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తామని, తద్వారా విద్యార్థులకు రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు అందిస్తామని చెప్పారు. ఎకరానికి సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయాలంటే రూ.47 వేలు ఖర్చు అవుతుందని, దాన్ని వివిధ పథకాల కింద తాము ఉచితంగానే అందజేస్తామని చెప్పారు. స్థానికంగా ఉండే ఉద్యాన శాఖ అధికారులు కిచెన్ గార్డెన్లపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతారని వెల్లడించారు.
Advertisement
Advertisement