విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు | More measures aimed at student welfare | Sakshi
Sakshi News home page

విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు

Published Wed, Oct 4 2023 4:21 AM | Last Updated on Wed, Oct 4 2023 4:36 AM

More measures aimed at student welfare - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన 15 రకాల ప్రమాదాలను నివారించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. హాస్టళ్లలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్‌ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థుల భద్రత, విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో అనేక ముందు జాగ్ర­త్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవాం­ఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. వాటిలో పాము కాటు, కుక్క కాటు, తేలు కుట్టడం, కరెంట్‌ షాక్, ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం, గాయపడటం, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం, అనారోగ్యం, కలుíÙత ఆహారం, ఈవ్‌ టీజింగ్‌ తదితరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదే­శిం­చింది. యంత్రాంగం తక్షణమే స్పందించడం వల్ల ప్రమాద తీవ్రతను, నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది.

ఏదైనా ఘటన జరిగితే వెంటనే హాస్టల్‌ బాధ్యులు సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేసి.. ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించింది. హాస్టళ్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేసింది. ఏదైనా హాస్టల్‌లో ఘటన జరిగితే.. 5 నిమిషాల్లోనే సంబంధిత హాస్టల్‌ బా­ధ్యులు స్పందించి అక్కడికి చేరుకోవాలని సూచించింది. పది నిమిషాల్లో ఉన్నతాధికారులకు.. 15 నిమిషాల్లో కలెక్టర్‌కు.. అరగంటలో­గా పిల్లల తల్లిదండ్రులకు సమాచారమివ్వాలని స్పష్టం చేసింది.

ఘటన తీవ్రత ఆధారంగా హాస్టల్‌ నిర్వాహకులతో పాటు డివిజనల్, జిల్లా స్థాయి అధికారులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన 24 గంటల్లో విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందించాల్సి ఉంటుంది. 48 గంటల్లోగా జిల్లా స్థాయి అధికారి ఘటనాస్థలిని సందర్శించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement