Undesirable events
-
విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన 15 రకాల ప్రమాదాలను నివారించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. హాస్టళ్లలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థుల భద్రత, విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. వాటిలో పాము కాటు, కుక్క కాటు, తేలు కుట్టడం, కరెంట్ షాక్, ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం, గాయపడటం, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం, అనారోగ్యం, కలుíÙత ఆహారం, ఈవ్ టీజింగ్ తదితరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. యంత్రాంగం తక్షణమే స్పందించడం వల్ల ప్రమాద తీవ్రతను, నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే హాస్టల్ బాధ్యులు సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేసి.. ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించింది. హాస్టళ్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేసింది. ఏదైనా హాస్టల్లో ఘటన జరిగితే.. 5 నిమిషాల్లోనే సంబంధిత హాస్టల్ బాధ్యులు స్పందించి అక్కడికి చేరుకోవాలని సూచించింది. పది నిమిషాల్లో ఉన్నతాధికారులకు.. 15 నిమిషాల్లో కలెక్టర్‌కు.. అరగంటలోగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారమివ్వాలని స్పష్టం చేసింది. ఘటన తీవ్రత ఆధారంగా హాస్టల్ నిర్వాహకులతో పాటు డివిజనల్, జిల్లా స్థాయి అధికారులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన 24 గంటల్లో విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందించాల్సి ఉంటుంది. 48 గంటల్లోగా జిల్లా స్థాయి అధికారి ఘటనాస్థలిని సందర్శించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. -
‘నయాసాల్’కు ట్రాఫిక్ ఆంక్షలు
⇒ నేటి రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు అమలు ⇒ ఫ్లై ఓవర్ల మూసివేత.. ⇒ పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పలు రహదారులు, ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంట కమిషనరేట్లలోని ఫ్లై ఓవర్లను నేటి రాత్రి మూసివేస్తారు. ఆంక్షలు బుధవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము 2 గంటల వరకు అమలులో ఉంటాయని వారు తెలిపారు. ఆంక్షలు ఇలా.. ⇒ ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించారు. ⇒ వీవీ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్ట్ వైపు వచ్చే వాహనాలు వీవీ విగ్రహం నుంచి ఖైరతాబాద్- రాజ్‌భవన్ రోడ్డు వైపు వెళ్లాలి. ⇒ బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్ట్ మీదుగా వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి లక్డీకాపూల్, అయోధ్య హోటల్ వైపు వెళ్లాలి. ⇒ లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను జీహెచ్ఎంసీ కార్యాలయం వై జంక్షన్ నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య హోటల్ మీదుగా మళ్లిస్తారు. ⇒ సచివాలయంను ఆనుకుని ఉన్న మింట్ కాంపౌండ్ రోడ్డుపై సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించ రు. ⇒ ఓఆర్ఆర్పై కూడా వాహనాలను అనుమతించరు. కేవలం విమాన ప్రయాణికులు తమ టికెట్లను చూపిస్తే అనుమతిస్తారు. ఔటర్‌పై కూడా.. శంషాబాద్ రూరల్: నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఇది గురువారం ఉదయం వరకు అమలులో ఉంటుంది. బుధవారం సాయంత్రం నుంచి పోలీసు నిఘా పెంచి గస్తీని ముమ్మరం చేయనున్నారు. గచ్చిబౌలి, తొండుపల్లి, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, బొంగులూరు, పెద్ద అంబర్పేట్ తదితర ప్రాంతాల్లోని టోల్గేట్ల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. -
ఒంటిగంట దాటితే జోష్ బంద్
ప్రణాళిక తయారీలో పోలీసు శాఖ ► అల్లరిమూకలపై నిఘా కోసం వీడియో కెమెరాలు సిద్ధం ► డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ స్మోకింగ్లపై నిఘా కోసం 20 టీముల ఏర్పాటు ► 31 వరకు 30 పోలీస్‌యాక్ట్ అమలు ► నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు అర్ధరాత్రి వరకు డ్రంకెన్‌డ్రైవ్ కర్నూలు : కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేలా జిల్లా పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది పకడ్బందీగా నిబంధనలు అమలు చేయడంతో ఒక రోడ్డు ప్రమాద మరణం కూడా లేకుండా వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది అదే రీతిలో వ్యవహరించాలని నిర్ణయించారు. 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండటంతో డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ధూమపానం సేవించడంపై నిఘా కోసం 20 పోలీసు బృందాలను ఇప్పటికే సిద్ధం చేశారు. నగర పరిధిలోని అన్ని 5 పోలీస్స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాల ద్వారా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై 133 సీఆర్పీసీ ప్రకారం చర్యలకు పోలీసు అధికారులు రంగం సిద్ధం చేశారు. వేడుకల పేరిట ఎవరైనా హింసాత్మక సంఘటనలకు, ఘర్షణలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి అధికారులకు స్వయంగా ఎస్పీ ఆదేశించడంతో ఈ మేరకు సర్కిళ్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్నిచోట్ల కూడా మద్యం బాబుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు పోలీసు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేయడం, సెలైన్సర్ తొలగించి పెద్ద పెద్ద హారన్ శబ్దాలు చేస్తూ ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారిపై నిఘా కోసం వీడియో కెమెరాలను సిద్ధం చేశారు. త్రిబుల్ రైడింగ్‌తో వీధుల్లో కేకలు వేయడం, ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కటకటాలకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. కొత్త సంవత్సర వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు మందు పార్టీలు చేసుకోవడంపై నిషేధం విధించారు. జనవరి 1వ తేదీ వరకు 30 పోలీస్యాక్టు అమలులో ఉంటున్నందున సామూహికంగా కాని, గుంపులుగా గాని ఒకచోట చేరకుండా కట్టడి చేసేందుకు పోలీసు బృందాలను నియమించారు. సాధారణ పౌరులు వెళ్లే డాబాలతో పాటు ధనవంతులు వెళ్లే నక్షత్రాల హోటళ్ల వరకు అన్నింటిపై కూడా పోలీస్ నిఘా ఉంటుంది. కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 29 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మద్యం దుకాణాలతో పాటు బార్లు మూసివేయాలని ఇప్పటికే పోలీసు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నగర శివారు ప్రాంతాల్లో మద్యం పార్టీలు, పేకాటలు నిర్వహించే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వేడుకల పేరుతో శివారు కాలనీల్లోని తోటలు, డాబాల్లో మద్యం పార్టీల ఏర్పాటుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్టేషన్ల వారీగా సిబ్బంది డాబాలపై నిఘా ఉంచారు. డిసెంబరు 31వ తేదీ వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నగర శివారులోని 10 కి.మీ. వరకు ఉన్న డాబాలపై నిఘా కోసం ఇప్పటికే పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోడానికి అర్ధరాత్రి జాతీయ రహదారులపై యువకులు బైక్రైడ్లకు పాల్పడతారన్న ముందుచూపుతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. యువకులు జాతీయ రహదారులపై మద్యం సీసాలను పగులగొట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గించిన సంఘటనలు గతంలో జరిగాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని అన్ని స్టేషన్ల అధికారులతో డీఎస్పీ రమణమూర్తి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై చర్చించి స్టేషన్ల వారీగా ప్రణాళికను రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని కట్టడి చేసేందుకు క్యూఆర్టీ వాహనాలకు బాధ్యతలు అప్పగించారు. బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వాటిపై నిఘా కోసం బ్లూకోల్డ్స్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు స్టేషన్ల వారీగా గస్తీ నిర్వహించే విధంగా డీఎస్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల వంటి ముఖ్య పట్టణాల్లో కూడా ఇదే తరహాలో బందోబస్తు ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.