ఒంటిగంట దాటితే జోష్ బంద్
ప్రణాళిక తయారీలో పోలీసు శాఖ
► అల్లరిమూకలపై నిఘా కోసం వీడియో కెమెరాలు సిద్ధం
► డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ స్మోకింగ్‌లపై నిఘా కోసం 20 టీముల ఏర్పాటు
► 31 వరకు 30 పోలీస్‌యాక్ట్ అమలు
► నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు అర్ధరాత్రి వరకు డ్రంకెన్‌డ్రైవ్
కర్నూలు : కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేలా జిల్లా పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది పకడ్బందీగా నిబంధనలు అమలు చేయడంతో ఒక రోడ్డు ప్రమాద మరణం కూడా లేకుండా వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది అదే రీతిలో వ్యవహరించాలని నిర్ణయించారు. 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండటంతో డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ధూమపానం సేవించడంపై నిఘా కోసం 20 పోలీసు బృందాలను ఇప్పటికే సిద్ధం చేశారు. నగర పరిధిలోని అన్ని 5 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాల ద్వారా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై 133 సీఆర్‌పీసీ ప్రకారం చర్యలకు పోలీసు అధికారులు రంగం సిద్ధం చేశారు.
వేడుకల పేరిట ఎవరైనా హింసాత్మక సంఘటనలకు, ఘర్షణలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి అధికారులకు స్వయంగా ఎస్పీ ఆదేశించడంతో ఈ మేరకు సర్కిళ్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్నిచోట్ల కూడా మద్యం బాబుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు పోలీసు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేయడం, సెలైన్సర్ తొలగించి పెద్ద పెద్ద హారన్ శబ్దాలు చేస్తూ ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారిపై నిఘా కోసం వీడియో కెమెరాలను సిద్ధం చేశారు. త్రిబుల్ రైడింగ్‌తో వీధుల్లో కేకలు వేయడం, ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కటకటాలకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. కొత్త సంవత్సర వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు మందు పార్టీలు చేసుకోవడంపై నిషేధం విధించారు. జనవరి 1వ తేదీ వరకు 30 పోలీస్‌యాక్టు అమలులో ఉంటున్నందున సామూహికంగా కాని, గుంపులుగా గాని ఒకచోట చేరకుండా కట్టడి చేసేందుకు పోలీసు బృందాలను నియమించారు. సాధారణ పౌరులు వెళ్లే డాబాలతో పాటు ధనవంతులు వెళ్లే నక్షత్రాల హోటళ్ల వరకు అన్నింటిపై కూడా పోలీస్ నిఘా ఉంటుంది. కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 29 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి.
ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మద్యం దుకాణాలతో పాటు బార్లు మూసివేయాలని ఇప్పటికే పోలీసు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నగర శివారు ప్రాంతాల్లో మద్యం పార్టీలు, పేకాటలు నిర్వహించే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వేడుకల పేరుతో శివారు కాలనీల్లోని తోటలు, డాబాల్లో మద్యం పార్టీల ఏర్పాటుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్టేషన్ల వారీగా సిబ్బంది డాబాలపై నిఘా ఉంచారు. డిసెంబరు 31వ తేదీ వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నగర శివారులోని 10 కి.మీ. వరకు ఉన్న డాబాలపై నిఘా కోసం ఇప్పటికే పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోడానికి అర్ధరాత్రి జాతీయ రహదారులపై యువకులు బైక్‌రైడ్‌లకు పాల్పడతారన్న ముందుచూపుతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. యువకులు జాతీయ రహదారులపై మద్యం సీసాలను పగులగొట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గించిన సంఘటనలు గతంలో జరిగాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని అన్ని స్టేషన్ల అధికారులతో డీఎస్పీ రమణమూర్తి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై చర్చించి స్టేషన్ల వారీగా ప్రణాళికను రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని కట్టడి చేసేందుకు క్యూఆర్‌టీ వాహనాలకు బాధ్యతలు అప్పగించారు. బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వాటిపై నిఘా కోసం బ్లూకోల్డ్స్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు స్టేషన్ల వారీగా గస్తీ నిర్వహించే విధంగా డీఎస్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల వంటి ముఖ్య పట్టణాల్లో కూడా ఇదే తరహాలో బందోబస్తు ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.