‘నయాసాల్’కు ట్రాఫిక్ ఆంక్షలు
⇒ నేటి రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు అమలు
⇒ ఫ్లై ఓవర్ల మూసివేత..
⇒ పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పలు రహదారులు, ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంట కమిషనరేట్లలోని ఫ్లై ఓవర్లను నేటి రాత్రి మూసివేస్తారు. ఆంక్షలు బుధవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము 2 గంటల వరకు అమలులో ఉంటాయని వారు తెలిపారు.
ఆంక్షలు ఇలా..
⇒ ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించారు.
⇒ వీవీ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్ట్ వైపు వచ్చే వాహనాలు వీవీ విగ్రహం నుంచి ఖైరతాబాద్- రాజ్‌భవన్ రోడ్డు వైపు వెళ్లాలి.
⇒ బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్ట్ మీదుగా వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి లక్డీకాపూల్, అయోధ్య హోటల్ వైపు వెళ్లాలి.
⇒ లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను జీహెచ్‌ఎంసీ కార్యాలయం వై జంక్షన్ నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య హోటల్ మీదుగా మళ్లిస్తారు.
⇒ సచివాలయంను ఆనుకుని ఉన్న మింట్ కాంపౌండ్ రోడ్డుపై సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించ రు.
⇒ ఓఆర్‌ఆర్‌పై కూడా వాహనాలను అనుమతించరు. కేవలం విమాన ప్రయాణికులు తమ టికెట్లను చూపిస్తే అనుమతిస్తారు.
ఔటర్‌పై కూడా..
శంషాబాద్ రూరల్: నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఇది గురువారం ఉదయం వరకు అమలులో ఉంటుంది. బుధవారం సాయంత్రం నుంచి పోలీసు నిఘా పెంచి గస్తీని ముమ్మరం చేయనున్నారు. గచ్చిబౌలి, తొండుపల్లి, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, బొంగులూరు, పెద్ద అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లోని టోల్‌గేట్ల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.