► రెండేళ్లుగా హాస్టళ్లను రద్దు చేస్తున్న ప్రభుత్వం
► ఇప్పటికే 83 వసతి గృహాల మూసివేత
► ఈ ఏడాది 28 మూసివేతకు నిర్ణయం
► ప్రశ్నార్థకంగా వేలాది మంది విద్యార్థుల జీవితాలు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రంగంపై చావుదెబ్బ కొడుతోంది. ఏటా ప్రభుత్వ వసతి గృహాలను మూసివేస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. హాస్టళ్ల మూసివేత కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మంది బడుగు, బలహీన, గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులు కొనసాగించలేకపోతున్నారు. హాస్టళ్లలో ఉంటూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ నిరుపేద విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. రెండేళ్లుగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను వరుసగా రద్దు చేస్తూ క్రమేణా పూర్తి స్థాయిలో మూసివేత దిశగా ప్రభుత్వం పయనిస్తోంది. కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగానే సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా మూసివేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోంది.
సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూసివేసేందుకు కసరత్తు పూర్తయింది. ఈ ఏడాది జిల్లాలోని 28 ఎస్సీ హాస్టళ్లను మూసివేయాలని నిర్ణయించారు. ఆయా హాస్టళ్లలో ఈ ఏడాది 1424 మంది బాలబాలికల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ నెల 21వ తేదీ లోగా ఇతర ప్రాంతాల్లోని వసతి గృహాలకు విద్యార్థులను తరలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. 5, 6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులను జిల్లాలోని 11 గురుకుల పాఠశాలలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలురకు సంబంధించి తాడికొండ, చుండూరు, అడవితక్కెళ్ళపాడు, కారంపూడి, నిజాంపట్నం, అచ్చంపేట హాస్టళ్లు ఉన్నాయి. బాలికలకు సంబంధించి అమరావతి, బాపట్ల, విజయపురి సౌత్, వినుకొండ, రేపల్లె, ఆర్‌కెపురం ఉన్నాయి. సమీకృత హాస్టళ్లకు సంబంధించి 3, 4, 9, 10 తరగతులు చదివే విద్యార్థులను బాలురకు సంబంధించి అమరావతి, పెదనందిపాడు, బృందావన్ గార్డెన్స్, గురజాల, మునిపల్లె, పొన్నూరు, రేపల్లె, ఫిరంగిపురంలలో చేర్చుతున్నారు. బాలికలకు సంబంధించి మంగళగిరి, రెంటచింతల, నరసరావుపేట, పిడుగురాళ్ళ, దుగ్గిరాల, గుంటూరుల్లోని వసతి గృహాల్లో చేర్చుతున్నారు.
మొత్తం 83 హాస్టళ్ల మూసివేత...
జిల్లాలో మొత్తం 94 ఎస్సీ హాస్టళ్లు ఉండగా 2015–16లో 31 హాస్టళ్లను రద్దు చేశారు. 2016–17 లో 28 హాస్టల్స్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. బీసీ హాస్టల్స్ 66 ఉండగా గత ఏడాది 8 హాస్టల్స్‌ను మూసివేశారు. ఈ ఏడాది మరికొన్ని హాస్టళ్లను మూసివేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్టీ హాస్టళ్లకు సంబంధించి జిల్లాలో మొత్తం 33 ఉండగా గత ఏడాది 13 హాస్టళ్లను మూసివేశారు. ఈ ఏడాది కూడా 3 హాస్టళ్లను మూసివేసేందుకు సమాయత్తమయ్యారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో కనీస వసతులు కరువు...
విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో చేర్చి ఇంగ్లీషు మీడియం భోదిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు కనీస వసతులు లేవు. కాంట్రాక్టు టీచర్లతో పాటు తగిన సిబ్బంది కూడా లేకపోవడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు విద్యార్థులను చేరుస్తున్న సమీప హాస్టల్స్‌లో సైతం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది గురుకుల పాఠశాలల్లో, హాస్టల్స్‌లో చేరిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసినట్లు తెలుస్తోంది. హాస్టల్స్ మూసివేతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో మూసివేస్తున్న ఎస్సీ బాలుర హాస్టళ్లు ఇవే...
జిల్లాలో మూతబడుతున్న బాలుర వసతి గృహాల్లో.. గుంటూరు, తాడికొండ, తుళ్ళూరు, కొప్పర్రు, రెంటచింతల, కర్లపాలెం, పొన్నూరు, చేబ్రోలు, నగరం, మేడికొండూరు, అచ్చంపేట, సత్తెనపల్లి, దుగ్గిరాల, కాట్రగడ్డ రేపల్లె, ప్రత్తిపాడు, గుంటూరు బృందావన్ గార్డెన్స్, వెల్లటూరు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 795 మంది విద్యార్థులు ఉన్నారు.
బాలికల హాస్టళ్లు ఇవీ...
మూతబడుతున్న బాలికల వసతి గృహాల్లో.. కొల్లిపర, క్రోసూరు, సత్తెనపల్లి, రేపల్లె, నగరం, మునిపల్లె, ముత్తుకూరు, చేబ్రోలు, తుళ్ళూరు, ముప్పాళ్ళ, గురజాల ఉన్నాయి. ఆయా హాస్టళ్లలో 629 మంది విద్యార్థినులు ఉన్నారు.