చలిలో సంక్షేమం!
–వర్దా తుపానుతో జిల్లాలో భారీ గాలులు
- రాత్రిపూట తీవ్రంగా పడిపోతున్న ఉషో్ణగ్రత
– చలికి వనుకుతున్న హాస్టళ్ల విద్యార్థులు
- పట్టించుకోని సంక్షేమ అధికారులు
కర్నూలు (సిటీ): సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో చల్లటి గాలులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలయితే చాలు చలి పంజా విసురుతోంది. దీంతో తల్లిదండ్రులకు, ఇంటికి దూరంగా వచ్చి సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు చల్లటి గాలులకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులకు సరైన కిటికిలు, వాకిళ్లు లేకపోవడం, దీనికితోడు వారికి బెడ్‌షీట్లు, స్వెటర్లు అందించకపోవడంతో రాత్రి వేళ వారు సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి.
జిల్లాలో పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 93, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు 101, గిరిజన హాస్టళ్లు 9, ఆశ్రమ హాస్టళ్లు 12 ఉన్నాయి. ఇందులో ఉన్న ఒక్కో విద్యార్థికి ఒక కార్పెట్, బెడ్‌షీట్‌ను ప్రభుత్వం అందించింది. అయితే, అవి నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులను చలి నుంచి కాపాడలేకపోతున్నాయి. వర్దా తుపాను ప్రభావంతో ఎప్పుడు లేని విధంగా గత నాలుగైదు రోజులుగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం తుపాను తీవ్రత మరింత పెరగడంతో గంటకు 192 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన దుప్పట్లు ఆ చల్లని గాలులకు ఏమాత్రం తట్టుకోలేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ రాత్రిళ్లు జాగరణ చేస్తున్నారు. ఇప్పటికే చలితీవ్రతతో చాలా హాస్టళ్ల విద్యార్థులు జలుబు, జ్వరం, అలర్జీ తదితర రోగాల బారిన పడ్డారు. పట్టించుకోవాల్సిన సంక్షేమ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్వెటర్లు ఇచ్చేదెన్నడో: వాస్తవంగా ప్రతి హాస్టల్ విద్యార్థికి శీతాకాలంలో వీచే చల్లటి గాలుల నుంచి రక్షణ కోసం స్వెటర్లు ఇవ్వాలని డిమాండ్ ఉంది. దీనిపై పలు విద్యార్థిసంఘాల నాయకులు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. చాలా వసతిగృహాల్లో గదులకు తలుపులు, కిటికిలు లేవు వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, సర్కారు హాస్టల్ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వసతి గృహాల్లోని విద్యార్థులు రాత్రిపూట చలికి వణుకుతూ పడుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు చలి తీవ్రతకు తట్టుకోలేక ఆయా హాస్టళ్ల పరిసరాల్లోని చెత్త, కట్టెల సహాయంతో చలి మంటలు వేసుకుంటున్నారు. విద్యార్థుల అవస్థ తెలిసిన హాస్టళ్ల వార్డెన్లు ప్రభుత్వం స్పందించనప్పుడు మేమేమి చేయగలమంటూ చేతులెత్తేస్తున్నారు. మరికొన్ని హాస్టళ్లలో అనారోగ్యాల బారిన పడిన విద్యార్థులను వార్డెన్లు ఇళ్లకు పంపుతున్నట్లు విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.