![Winter Effect Night Temperature Decreasing In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/7/winter.gif.webp?itok=B-4BYbN2)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నప్పటికీ.. రాత్రిళ్లు మాత్రం చలి గజగజ వణికిస్తోంది. గత మూడ్రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. ఇదే స్థాయిలో కొనసాగితే పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతాయని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. గతేడాది ఇదే సమయంలో పగలు, రాత్రి సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అయితే గత సంవత్సరం రాష్ట్రంలో సాధారణ వర్షాలే కురిశాయి. కానీ ఈసారి చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 18 జిల్లాల్లో అతిభారీ వర్షపాతం, 9 జిల్లాల్లో భారీ వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భూగర్భ జలాలు సైతం భారీగా పెరిగాయి. ఈ పరిస్థితులతోనే ఉష్ణోగ్రతల నమోదులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
9 డిగ్రీలు పతనం..
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే ఈసారి చలి తీవ్రత భారీగా ఉండే అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గింది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్‌లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ 12 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తోంది. ఇందులో ఖమ్మం మినహా మిగతా 11 కేంద్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల్లోపే నమోదు కావడం గమనార్హం. పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఖమ్మంలో గరిష్టంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో 32 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా నవంబర్ నెలాఖరులో చలి తీవ్రత పెరుగుతుంది. కానీ ఈనెల మొదటి వారంలోనే చలి పెరగడంతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.
బేలలో 10.3 డిగ్రీలు..
రాష్ట్రంలో పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 10.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా కుబీర్‌లో 10.6 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 11.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో 11.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా మథూర్‌లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 12 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment