
ఉదయం 7 గంటలు దాటినా వీడని మంచు
వామ్మో చలి చంపేస్తోంది. వెచ్చగా దుప్పటి కప్పుకుని ఇంకో గంట కునుకు తీయాలనిపిస్తోంది.. ఇది జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. పలు పట్టణాల్లో చలి పంజా విసురుతోంది. అడుగు బయట పెట్టాలంటేనే వణుకు పుడుతోంది. బారెడు పొద్దెక్కినా బెడ్ నుంచి కాలు కిందకు మోపాలంటే భయమేస్తోంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. చిన్నపాటి జాగ్రత్తలతో మన ఆరోగ్యం పదిలంగా కాపాడుకుందాం..
నెల్లూరు(బారకాసు): శీతాకాలంలో ఏర్పడే మంచుతెరలు కొందరితో కేరింతలు కొట్టిస్తే.. మరి కొందరికి వణుకు పుట్టిస్తాయి. సాయంత్రం వేళ వీచే చల్లటి గాలులు కొందరికి ఆహ్లాదంగా ఉండి హాయిని కలిగిస్తే.. మరికొందరికి గుండె దడ పుట్టిస్తాయి. సీజన్ మారగానే కొన్ని రకాల వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. చలికాలంలో తుమ్ములు, దగ్గు, ఆస్తమా, ఆయాసం, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటే వృద్ధులు, పిల్లలు చలికి బయటకు రాలేక వణికిపోతారు. వచ్చినా వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వ్యాధులు ప్రబలే అవకాశం అధికం. చలికాలంలో వ్యాధులబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
హచ్..హచ్‌కి.. తూచ్ చెప్పేద్దాం..
శీతాకాలం కారణంగా రకరకాల వ్యాధులు విజృంభించే వీలుంది.
♦ ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస పీల్చుకోవడం క్లిష్టతరమవుతుంది. కొంత మందిలో ఆయాసం పెరుగుతుంది. శ్వాసకోస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు.
♦ ఆస్తమా ఉన్నవారు చలిగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి నొప్పుల తీవ్రత అధికమవుతోంది. చలి తీవ్రతకు కాళ్లు ముడుచుకోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
♦ ఆరు పదులు దాటినవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు ఉదయం వేళ నడకకు, వ్యాయామానికి దూరంగా ఉండాలి.
♦ చలి తీవ్రతకు కండరాలు బిగుసుకు పోయి రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. శ్వాసకోశ వ్యాధులతో పాటు జ్వరాలు వచ్చే వీలుంది. అంతేకాకుండా స్వైన్‌ఫ్లూ కూడా సోకే అవకాశం ఉంది.
♦ ధూమపానం చేసేవారిలో ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి.
ప్రతి ఆరుగురిలో ఇద్దరికి ఆస్తమా..
నగరంలో శ్వాసకోశ, ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రులకు వస్తున్న పిల్లల్లో ప్రతి ఆరుగురిలో ఇద్దరు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గడం, చలిగాలులతో పాటు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా పెద్దలు, చిన్నారుల్లో శ్వాస సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి. విపరీతమైన జనసాంద్రత, దోమల బెడద ఎక్కువగా ఉండటంతో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడటం వల్ల చలికాలంలో పిల్లలతో పాటు, పెద్ద వారిలో కూడా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆస్తమా సోకిన చిన్నారులకు శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం చేరడం వలన శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బంది కరంగా మారుతోంది. దీంతో నిమోనియాకు దారితీయడంతో పాటు, ఒక్కో సమయంలో ప్రాణాంతకంగా మారుతోంది. గుండె జబ్బులు ఉన్న వారు చలికాలంలో బయటకు రాకూడదు. చలి అధికంగా ఉన్నప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.
చిన్నారులకు చిక్కులు
పసిపిల్లలకు చలిగాలుల కారణంగా మరిన్ని సమస్యలు వచ్చే వీలుంది. జలుబు, దగ్గు, వారిని వేధించడం పరిపాటి. కొంత మంది పిల్లల్లో నిమోనియా వచ్చే ప్రమాదం ఉంది. చర్మం కమిలిపోయి, బుగ్గలు, శరీరంపై కురుపులు వస్తాయి. చర్మం చిట్లిపోయి మంట, దురదలు ఇబ్బంది పెడతాయి.
చర్మానికి శత్రువు.. చలి
♦ చలిగాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుం ది. దాంతో చర్మం పొడిబారిపోతుంది.
♦ చర్మం చిట్లిపోయి పగులుతుంది. పెదవులు, ముఖం, అరికాళ్లు, పాదాలు, చేతులు పగిలిపోయి మంటపుడుతుంది. కొందరిలో రక్తం శ్రవిస్తుంది. మరికొందరిలో సోరియాస్ వ్యాధి తీవ్రతరమవుతుంది. చర్మం కమిలిపోయినట్లు ఉంటుంది. వృద్దుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది.
ఇన్‌ఫెక్షన్లు అనేకం..
ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు శరవేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు వేగంగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు అయిన స్వైన్‌ఫ్లూ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్తలు అవసరం
♦ చలితీవ్రత అధికంగా ఉన్న సమయంలో, ముఖ్యంగా రాత్రి వేళ బయటకు రాకుండా ఉంటే ఎంతో మేలు.
♦ రాత్రిపూట విధి నిర్వహణకు వెళ్లేవారు శరీరమంతా కప్పుకునే విధంగా వస్త్రాలు ధరించాలి. ముఖానికి మాస్క్‌లు ధరించడం మంచిది.
♦ జలుబు, దగ్గు ఒకరి నుంచి మరొకరికి రాకుండా మాస్కులు ధరించాలి. ఉన్ని వస్త్రాలు చాలా ఉత్తమం. జలుబు, దగ్గు ఉన్న వారు చల్లని నీరు, ఐస్‌క్రీమ్ తీసుకోకూడదు.
♦ పిల్లలకు వేడి వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. పిల్లలను ఉదయం పూట స్కూల్స్‌కి పంపే సమయంలో స్వెట్టర్లు వేయాలి. ముఖానికి మాస్క్‌లు వేసి పంపితే ఇంకా మంచింది.
♦ కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. చల్లని నీరు అధికంగా తాగితే సైన్‌సైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ముందు జాగ్రత్తలు తప్పనిసరి
ఆస్తమాను సైతం చలికాలంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. అవగాహన కలిగి ఉండి మందు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి అధికంగా ఉన్నప్పుడు ఆస్తమా తీవ్రత పెరిగితే నెబ్యులైజర్ చికిత్సతో పాటు, అవసరమైన సమయంలో ఇంజక్షన్‌లు ఇవ్వాలి. దీర్ఘకాలిక ఆస్తమాకు ఇన్‌హేలర్లు అత్యుత్తమం. ఇన్‌హేలర్లు ద్వారా ఇచ్చే మందులు డోసులు, నోటి ద్వారా, ఇంజక్షన్‌ల ద్వారా ఇచ్చే మందుల డోసుల కంటే చాలా తక్కువ. ప్రయోజనం ఎక్కువ.– డాక్టర్ సత్యప్రకాష్, అసిస్టెంట్‌ప్రొఫెసర్, పిడియాట్రిక్ విభాగం, జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment